Andhra Pradesh: చిట్టీల పేరుతో చీటింగ్‌.. రూ.6 కోట్లతో ఉడాయింపు.. లబోదిబోమంటోన్న బాధితులు

కృష్ణాజిల్లా పామర్రులో ఘరానా మోసం చోటు చేసుకుంది. ఓ చిట్టీ చిలకయ్య బోర్డు తిప్పెయ్యడంతో వందమందికి పైగా బాధితులు రోడ్డున పడ్డారు. కోట్ల రూపాయలు పోగొట్టుకుని గోడుగోడున విలపిస్తున్నారు.

Andhra Pradesh: చిట్టీల పేరుతో చీటింగ్‌.. రూ.6 కోట్లతో ఉడాయింపు.. లబోదిబోమంటోన్న బాధితులు
Chit Fund Fraud

Updated on: Jan 05, 2024 | 6:54 AM

కృష్ణాజిల్లా పామర్రులో ఘరానా మోసం చోటు చేసుకుంది. ఓ చిట్టీ చిలకయ్య బోర్డు తిప్పెయ్యడంతో వందమందికి పైగా బాధితులు రోడ్డున పడ్డారు. కోట్ల రూపాయలు పోగొట్టుకుని గోడుగోడున విలపిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నాడనే నమ్మకంతో చిట్టీలు వేసినవాళ్లను చీటింగ్‌ చేశాడు ఆ ప్రబుద్ధుడు. వాళ్ల నమ్మకమే అతడి మోసానికి పెట్టుబడిగా మారింది. వాళ్ల నమ్మకమనే బలహీనతను అతగాడు బలంగా మార్చుకుని ఆశల వల వేసి వాళ్లను దారుణంగా దగా చేశాడు. పామర్రులో చిట్టీల పేరుతో వందమందికి పైగా మోసం చేశాడు తలశిల రామ్మోహన్ రావు. ఆరు కోట్ల రూపాయలకు పైగా జనాన్ని మోసం చేశాడు. చిట్టీల పేరుతో జనాన్ని నిండా ముంచి పారిపోయిన తలశిల రామ్మోహన్‌ రావును ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఈ ఘరానా మోసగాడికి రిమాండ్‌ విధించింది. గత ఐదు సంవత్సరాలుగా బందర్‌ రోడ్డులో చీటి పాటలు, నరసింహ బోటిక్స్‌ నిర్వహిస్తున్నాడు రామ్మోహన్‌ రావు. సడెన్‌గా ఓ రోజు అదృశ్యమై పోయాడు. దీంతో చిట్టీలు వేస్తున్న జనం ఎంక్వయిరీ చేయడంతో రామ్మోహన్‌రావు నిర్వాకం బయటపడింది.

రామ్మోహన్‌ రావుపై గత నెల 27న పామర్రుకు చెందిన చిలుకూరి సుమతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతగాడికి 80 లక్షల రూపాయల నగదుతో పాటు చిట్టీలకు 40 లక్షల రూపాయలు కట్టానని, మొత్తం కోటి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి మోసపోయానంటూ కన్నీటి పర్యంతమవుతోంది సుమతి. తన కుమార్తె కూడా రామ్మోహన్‌ రావు దగ్గర 65 లక్షల రూపాయల చిట్టీలు వేసిందని సుమతి వాపోయారు. పెళ్లి కోసం దాచుకున్న లక్షల రూపాయల సొమ్మును కూడా అతగాడికి ఇచ్చి మోసపోయామంటూ బాధితులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నిడుమోలు లాకులుకు చెందిన అట్లూరి వెంకటేశ్వరరావు 55 లక్షల రూపాయల చీటీలు వేసి మోసపోయానంటూ వాపోతున్నారు. వీళ్లే కాకుండా టీచర్లు, రోజువారీ పనులు చేసుకునే వారు కూడా బాధితుల్లో ఉన్నారు. ఇక మోసపోయిన వారిలో పోలీసులు కూడా ఉండడం విశేషం. తలశిల రామ్మోహన్‌రావుపై సెక్షన్ 386, 406, 420 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..