ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మొదలైంది. పొలింగ్ కు సమయం దగ్గరపడుతుండటంతో పార్టీలు మాటల తూటాలతో రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో విశాఖపట్నం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాస్ కీలక ప్రకటన జారీ చేశారు. ఈ నెల 13న జరగనున్న ఉత్తర కోస్తా ఆంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా జిల్లాలో మూడు రోజుల పాటు అన్ని మద్యం దుకాణాలను బంద్ చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాల్లో పట్టభద్రుల (North Coastal Andhra) ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది.
జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లికార్జున ఆదేశాల మేరకు 11వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 13న సాయంత్రం 4 గంటల వరకు ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లు, టూరిజం బార్‌లు, నేవల్ క్యాంటీన్లు, మద్యం డిపోలను బంద్ చేస్తున్నట్లు తెలిపారు. ఆ మూడు రోజులు మద్యం షాపులు మూసివేయాలని లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అలాగే ఓట్ల లెక్కింపు జరిగే 16వ తేదీన కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో మద్యం దుకాణాలను బంద్ చేయాలని ఉత్తర్వుల్లో తెలిపారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..