Andhra Pradesh Crime: జులాయి తిరుగుళ్ల కోసం ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదని జన్మనిచ్చిన కన్నతల్లిని కడతేర్చాడు ఓ కసాయి తనయుడు. ఈ దారుణ ఘటన కడప జిల్లా సిద్ధవటం మండలం పార్వతి పురంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పార్వతీపురం కాలనీలో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్న బ్రహ్మయ్య జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసయ్యాడు. మద్యం కోసం అప్పులు చేశాడు. అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి అధికమైంది. దీంతో తల్లి సీతా రాములమ్మను డబ్బు ఇవ్వాలంటూ రోజు వేధించేవాడు. ఈ క్రమంలో కొడుకు వేధింపులు తాళలేక కొడుకును ఇంటి నుండి వెళ్లిపోవాలని తల్లి హెచ్చరించింది. ఇంటి నుండి వెళ్ళిపోతే అప్పు తీసుకున్న వారి నుంచి ఒత్తిడి మరింత తీవ్రతరం అవుతుందని భావించిన కొడుకు పీకల్లోతు మద్యం సేవించి ఆ మత్తులో ఇంటికి వచ్చాడు. ఆ క్రమంలో తల్లితో గొడవకు దిగాడు. ఇద్దిర మధ్య మాటా మాటా పెరిగింది. క్షణికావేశంలో తల్లి చింత గింజల సీతారాములమ్మను(65) రోకలి బండతో మోదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలం వద్దకు చేరుకుని, రాజంపేట డిఎస్పీ శివ భాస్కర్ రెడ్డి కి విషయం తెలిపారు. దీంతో డిఎస్పీ సైతం ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్‌పెక్టర్ హనుమంతు నాయక్, సిద్ధవటం మండలం ఎస్సై మధుసూదన్ రెడ్డి లు సీతా రాములమ్మ మృతదేహాన్ని పంచనామా నిమిత్తం కడప రిమ్స్ హాస్పిటల్స్ కు తరలించారు. హత్యా ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డిఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యానికి బానిసైతే అది మనల్ని ఏ పైనినైనా చేయిస్తుందని అన్నారు. యువత మద్యానికి అలవాటు పడకుండా తల్లితండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.
Also read:
Navratri Special Recipe: పండుగ సమయంలో ఉపవాసం ఉండేవారికి అద్భుతమైన అల్పాహారం.. మీరు ట్రై చేయండి..