
పులులు బాబోయ్.. పులులు.. జనావాసాల్లోకి వస్తున్న చిరుతలు, పెద్దపులులతో పల్లెవాసులు హడలిపోతున్నారు. ఇటీవల పలు ప్రాంతాల్లో చిరుతల సంచారాలు కలకలం రేపుతున్నాయి. అడవుల నుంచి పొలాల్లోకి వచ్చి భయపెట్టడమే కాదు.. ఇప్పుడు ఏకంగా జనావాసాల్లోకి ప్రవేశిస్తూ వణుకు పుట్టిస్తున్నాయి. తాజాగా చిరుతపులి దెబ్బకు ఆ గ్రామం వణుకుతుంది.. ఎప్పుడు దాడి చేస్తుందో.. ఎవరిపై పడి ప్రాణాలు తీస్తుందో.. అని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు ఆ గ్రామం ప్రజలు. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తమకు రక్షణ కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
కడప జిల్లా సిద్దవటం మండలంలో చిరుత సంచారం కలకలం రేపింది.. సిద్దవటం మండలం మూలపల్లిలో చిరుత సంచరించడం స్థానికులు గమనించారు. మూలపల్లి ఎస్సీ కాలనీ సమీపంలో చిరుతను చూసిన స్థానికులు కేకలు వేయడంతో చిరుత సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు చిరుత ఆచూకీ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. అటవీ సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తం గా ఉండాలని అధికారులు సూచించారు. అటవీ సమీప గ్రామం కావడం వల్లే జనావాసాల మధ్యకు వచ్చి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
ఇటీవల మూలపల్లి సమీపంలో చిరుతలు అప్పుడప్పుడు దర్శనమిస్తూనే ఉన్నాయని స్థానికులు అంటున్నారు. అటవీ సమీపంలో ఉన్న గృహాల వద్ద నక్కినక్కీ చిరుతలు తిరుగుతున్నాయని గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం చిరుత సమాచారం ఉంటే తమకు తెలపాలని, భయపడాల్సిన అవసరం లేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచిస్తున్నారు. సిద్ధవటం ప్రాంతంలో ఉన్న లంకమల అటవీ ప్రాంతంలో చిరుతల సంచారం ఉంది. దీనిని టైగర్ జోన్ గా కూడా చెబుతారు ఈ క్రమంలో స్థానికులు అప్రమత్తంగా ఉండడంతో పాటు రాత్రులు అలాగే తెల్లవారుజాము ప్రాంతాలలో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..