Rajamahendravaram: అసలు చిరుత ఎక్కడి నుంచి వచ్చింది..? ఎటు వైపు వెళ్తోంది…?
చిరుత ఎక్కడ...? చిరుత ఎక్కడ...? ఇప్పుడు రాజమండ్రిలో ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్నది. నలుగురిలో ముగ్గురు చిరుత గురించే మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడు ఎటు నుంచి వచ్చి ఎటాక్ చేస్తుందోనన్న భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. బయట కాలు పెట్టాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. అసలు ఆపరేషన్ చిరుత ఎంతవరకొచ్చింది...? రెండ్రోజులుగా చిరుత కోసం గాలిస్తున్న ఫారెస్ట్ అధికారులు ఇప్పటివరకు తేల్చిందేంటి...?

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి పరిసర ప్రాంతాల్ని చిరుత వణికిస్తోంది. ఎక్కడి నుంచి వచ్చిందో.. ఎటు నుంచి వచ్చిందో తెలీదుకానీ… స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఇంట్లోంచి కాలు బయట పెట్టాలంటేనే గజ్జుమంటున్నారు. ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తుందో తెలియక… రైతులు సైతం పొలాలకు వెళ్లడమే మానేశారు. లాలాచెరువు, దివాన్ చెరువు, ఆటో నగర్ ప్రాంతాల్లో పరిస్థితి మరీ భయానకంగా మారింది. చిరుత అన్న పదం వింటనే వణికిపోతున్నారు అక్కడి జనం.
చిరుత కోసం రెండ్రోజులుగా వేట కొనసాగుతోంది. ఆపరేషన్ చిరుత అంటూ రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు… ముమ్మరంగా గాలిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ ముందుకెళ్తున్నారు. శనివారం రికార్డైన సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా సెర్చింగ్ కంటిన్యూ అవుతోంది. అయితే… చిరుతను గుర్తించేందుకు వర్షం అడ్డంకిగా మారుతోంది. వర్షం వల్ల చిరుత పాదముద్రలను గుర్తించలేకపోతున్నాం… ఎటు వైపు వెళ్తుందో తెలుసుకోలేకపోతున్నామంటున్నారు ఫారెస్ట్ అధికారులు. డీఎఫ్‌ఓ సైతం రంగంలోకి దిగారు. చిరుతను పట్టుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.
రాజమండ్రి పరిసర ప్రాంతాలైన లాలాచెరువు, ఆటో నగర్ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు సమాచారం వచ్చిందంటున్నారు అధికారులు. ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మోహరించారు. చిరుతను పట్టుకునేందుకు నలుదిక్కుల నుంచి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. 50 ట్రాప్ కెమెరాలతో పాటు 4 బోన్లను ఏర్పాటు చేశారు. అలాగే చిరుతల గుంపు తిరుగుతుందన్న మాటలను ఖండించారు. ఒక్క చిరుత మాత్రమే తిరుగుతున్నట్లు తెలిపారు.
ఇటు రెవెన్యూ, ఫారెస్ట్, పోలీసు అధికారులు సైతం గ్రామాల్లో మైక్‌ల ద్వారా అనౌన్స్‌మెంట్ చేస్తూ.. ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ఎవర్వూ బయటకు తిరగొద్దని…. చిరుతకు సంబంధించిన ఎలాంటి విషయం తెలిసినా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలంటున్నారు. మొత్తంగా… చిరుత సంచారంతో జనం వణుకుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లలేకపోతున్నామంటున్నారు. చిరుతను వెంటనే పట్టుకుని తమకు విముక్తి కలిగించాలని అధికారులను కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




