సత్తెనపల్లి టీడీపీలో అధిపత్య పోరు.. తగ్గేదే లేదంటూ ఒకరు, లోకేష్ పాదయాత్ర సన్నాహాల్లో మరొకరు.. వివరాలివే..

|

Aug 04, 2023 | 9:59 PM

Guntur Politics: లోకేష్ అడుగుపెట్టకముందే సత్తెనపల్లి రాజకీయాల్లో కాక పుట్టింది. ధిక్కారస్వరం వినిపిస్తున్న కోడెల వర్గానికి నోటీసులతో వార్నింగ్‌ ఇచ్చింది అధిష్ఠానం. మరి కోడెల శివరాం ఎత్తుకు పై ఎత్తులేస్తారా.. లేకపోతే సర్దుకుపోతారా? సత్తెనపల్లిలో గందరగోళంగా ఉన్న పార్టీ పరిస్థితిని చక్కదిద్దేందుకు టీడీపీ పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? లోకేష్‌ పాదయాత్రలో ఎలా ఉండబోతోంది సీన్‌..?

సత్తెనపల్లి టీడీపీలో అధిపత్య పోరు.. తగ్గేదే లేదంటూ ఒకరు, లోకేష్ పాదయాత్ర సన్నాహాల్లో మరొకరు.. వివరాలివే..
Kodela Sivaram Vs Kanna Lakshmi Narayana
Follow us on

సత్తెనపల్లి, ఆగస్టు 4: ‘పార్టీని కంటికి రెప్పలా కాపాడిన లీడర్‌ కొడుకుని.. నన్నే అవమానిస్తారా’ అంటూ కోడెల వారసుడు కన్నెర్ర చేస్తున్నారు. సీనియర్‌ లీడర్‌కి సత్తెనపల్లి బాధ్యతలిచ్చిన టీడీపీకి ఈ సంక్షోభం పెద్ద తల నొప్పిగా మారింది. కోడెల శివరాంకి చెక్‌ పెట్టేందుకు కొందరికి నోటీసులిచ్చినా.. సత్తెనపల్లి టీడీపీలో ఇప్పట్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా కనిపించడం లేదు. కోడెల మరణం తర్వాత దారితెన్ను లేకుండా ఉన్న పార్టీని ఏకం చేసి విజయం దిశగా నడిపించేందుకు కన్నా లక్ష్మీనారాయణకు ఇంచార్జ్ బాధ్యతలిచ్చింది టీడీపీ నాయకత్వం. అయితే కన్నా నాయకత్వాన్ని బాహాటంగానే వ్యతిరేకించి కలకలం రేపారు కోడెల శివరాం. ఒక వైపు కన్నా లక్ష్మీ నారాయణ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూనే మరో వైపు పార్టీ అధినేతను ప్రశ్నిస్తున్నారు.

టీడీపీలో కోడెల పేరు లేకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారంటూ శివరాం ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. అక్కడితోనే ఆగలేదు కోడెల శివరాం. కన్నాకు వ్యతిరేకంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ కోడెల పేరుతో పల్లె నిద్ర, కార్యకర్తల పరామర్శలు చేస్తున్నారు. దీంతో సత్తెనపల్లి టీడీపీలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. నాలుగు రోజుల్లో నారా లోకేష్ పాదయాత్ర సత్తెనపల్లి నియోకవర్గంలోకి రానుంది. ఈ లోపే పార్టీలో పరిస్థితిని చక్క దిద్దాలని అధిష్ఠానం భావిస్తోందట. అందుకే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని.. కన్నాకు సహకరించని పదహారు మంది టీడీపీ నేతలకు నోటీసులు కూడా ఇచ్చారు. దీనిపై కోడెల శివరాం మండి పడుతున్నారు. పార్టీ అభివృద్ధికి కష్టపడ్డ వారికి నోటీసులు ఇవ్వడం ఏమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇలా ధిక్కార స్వరం వినిపించటంతో కోడెల శివరాంని టార్గెట్‌ చేసుకునే.. ఆయన మద్దతుదారులకు నోటీసులు ఇచ్చినట్లు ప్రచారం కూడా జరుగుతోంది. మొదట కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులను దారిలోకి తెచ్చుకునేందుకే పార్టీ నాయకత్వం ప్రయత్నిస్తోందని అంటున్నారు. ఆ తర్వాత కోడెల శివరాం మాట వినకుంటే వేటు వేస్తారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇంతదూరమొచ్చాక తగ్గేదే లేదంటున్నారు కోడెల శివరాం. మరోవైపు లోకేష్ పాదయాత్ర సమయంలో ఎలాంటి  పరిస్థితులుంటాయోనన్న చర్చ సత్తెనపల్లి నియోజకవర్గంలో నడుస్తోంది. కన్నా లక్ష్మీనారాయణ ఇప్పటికే పాదయాత్ర సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు కోడెల శివరాం కూడా లోకేష్‌ పాదయాత్రలో పాల్గొంటానని చెబుతున్నారు. దీంతో ఈ వివాదాలకు పార్టీ ఎలా తెరదించుతుందో సత్తెనపల్లి తమ్ముళ్లకు అంతు పట్టటం లేదు.

ఇవి కూడా చదవండి