ఎద్దుల కుమ్ములాటలో గాయపడిన న్యాయవాది ఫిర్యాదు.. కార్పోరేషన్ అధికారుల నిర్లక్ష్యంపై కేసు నమోదు.

|

Jun 27, 2022 | 5:59 PM

పోట్లాడుతున్న ఒక ఎద్దు అకస్మాత్తుగా వచ్చి రోడ్డు వెంట వెలుతున్న అడ్వకేట్ ను ఢీ కొట్టింది. లేచి వెళ్ళే లోపలే మరొసారి పొడిచింది. దీంతో ఏం జరిగిందో తెలిసే లోపలే..

ఎద్దుల కుమ్ములాటలో గాయపడిన న్యాయవాది ఫిర్యాదు.. కార్పోరేషన్ అధికారుల నిర్లక్ష్యంపై కేసు నమోదు.
Bull Fight
Follow us on

అది మంగళగిరి మార్కెట్ సెంటర్… ఆ రోజు ఏప్రిల్ 19… సమయం సాయంత్రం 4 గంటలు. మార్కెట్ సెంటర్ కావటంతో వచ్చి పోయే వారితో రద్దీగా ఉంది. అదే రహదారిపై ఒక యువ న్యాయవాది వెలుతున్నాడు. హైకోర్టులో పని చేసే న్యాయవాది సరుకులు కొనుగోలు చేసేందుకు షాపు వద్దకు చేరుకున్నాడు.. అతని పేరు గోలి కోటేశ్వరరావు. అదే సమయంలో రెండు ఎద్దులు తీవ్రంగా పోట్లాడుకుంటున్నాయి. ఎద్దుల పోట్లాటను గమనించని లాయర్ తన పనిలో నిమగ్నమై వెలుతున్నాడు. పోట్లాడుతున్న ఒక ఎద్దు అకస్మాత్తుగా వచ్చి రోడ్డు వెంట వెలుతున్న అడ్వకేట్ ను ఢీ కొట్టింది. లేచి వెళ్ళే లోపలే మరొసారి పొడిచింది. దీంతో ఏం జరిగిందో తెలిసే లోపలే కోటేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డాడు. కుడి చెయ్యి, కాలుకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఎన్ ఆర్ ఐ ఆసుపత్రికి తరలించారు. మల్టిపుల్ ఫ్రాక్చర్స్ కావటంతో నెల రోజుల పాటు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది.

ఈ ఘటనపై తీవ్ర మనస్థాపం చెందిన న్యాయవాది మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్పోరేషన్ అధికారులు నిర్లక్ష్యంగా ఎద్దులను రోడ్డుపై వదిలి పెట్టారని, అవి ఢీ కొనడంతో తాను తీవ్రంగా గాయపడ్డానని అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. అయితే మంగళగిరి పోలీసులు పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. అయితే పట్టు వదలని న్యాయవాది కేసు నమోదు చేయాలని పట్టు పట్టారు. దీంతో ఘటనా జరిగిన రెండు నెలల తర్వాత మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 289 కింద ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే ఆరు నెలల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది.

అయితే న్యాయవాది ఒక్కడే కాదు తాము కూడా రోడ్డుపై వదిలి పెట్టిన ఎద్దులు, అవులతో ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా స్థానిక కార్పోరేషన్ అధికారులు స్పందించి ఆవులు రోడ్లపైకి రాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రిపోర్టర్: టి నాగరాజు, టివి9 తెలుగు, గుంటూరు.