
ఒకప్పుడు ఆ జిల్లా టీడీపీకి కంచుకోట. ఇప్పుడు డబుల్ గేమ్ పాలిటిక్స్‌కి కేరాఫ్ అడ్రస్. రాష్ట్రంలో విపక్ష టీడీపీ 16 స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా.. ఉమ్మడి సిక్కోలుజిల్లాలోనే 5 స్థానాలను పెండింగ్‌లో ఉంచిది. అవేవో ఆశామాషీ స్థానాలు ఎంతమాత్రం కాదు. కాకలుతీరిన రాజకీయ కుటుంబాలకు చెందిన నేతలే ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్నారు. మరి సీనియర్ నేతలకు టికెట్ కన్ఫామ్ కాకపోవడంతో కేడర్ అంతా కన్ఫ్యూజన్‌లో ఉందట. ఎందుకు?
ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళంజిల్లా ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. ఈజిల్లాలో కిమిడి కళా వెంకట్రావు, కింజరాపు, కలమట, గౌతు కుటుంబాలతోపాటు మరికొన్ని రాజకీయ కుటుంబాలు పార్టీకి మూలస్తంభాలుగా ఉంటూ వచ్చాయి. కళా వెంకట్రావు, కలమట మోహన్‌రావు ఒకసారి పీఆర్పీలోకి వెళ్లి మళ్లీ సొంతగూటికి చేరుకోగా.. కలమట మోహన్‌రావు కుమారుడు వెంకటరమణ 2014లో వైసీపీలోకి వెళ్లి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే టర్మ్‌లో తిరిగి సొంతగూటికి చేరుకొని క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గాలి వీచినప్పటికీ.. సిక్కోలుజిల్లాలో శ్రీకాకుళం ఎంపీతోపాటు టెక్కలి, ఇచ్చాపురం అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ సత్తా చాటింది. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఎందుకో కాస్తా డీలా పడినట్లు కనిపిస్తోంది టీడీపీ. ఇందుకు కొన్ని రాజకీయ కారణాలు ఉంటే.. అధిష్ఠానం నిర్ణయాలు కూడా ఉన్నాయంటున్నారు. ఇప్పటికే వైసీపీ తమ అభ్యర్థులను ప్రకటించి ముందుకెళ్తే..10 నియోజకవర్గాలు ఉన్న ఉమ్మడి శ్రీకాకుళంజిల్లాలో ఇంకా 5 స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించలేదు. దాంతో ఆ నియోజకవర్గాలపై ఉత్కంఠ నెలకొంది.
ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయకర్తగా కిమిడి కళా వెంకట్రావు ఉన్నారు. ఎస్టీ రిజర్వుడు స్థానమైన పాలకొండకు కళా అనుచరుడైన నిమ్మక జయకృష్ణ సమన్వయ కర్తగా కొనసాగుతున్నారు. ఈ రెండు నియోజకవర్గాలకు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు టీడీపీ. శ్రీకాకుళం నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి సమన్వయకర్తగా ఉన్నారు. పాతపట్నంలో మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, పలాస నుంచి గౌతు శిరీష సమన్వయకర్తగా ఉన్నారు. ఇంత సీనియార్టీ ఉన్న ఈ నేతలకు ఇప్పటివరకూ టికెట్ కన్ఫామ్ కాకపోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టికెట్ జాప్యంపై అవమానంగా ఫీల్ అవుతున్నారట. రకరకాల ప్రచారం నేపథ్యంలో కేడర్‌కి ఏం చెప్పాలో తెలియక వీరంతా సందిగ్ధంలో ఉన్నారట. దీనికితోడు ఎచ్చెర్ల, శ్రీకాకుళం నియోజకవర్గాలను పొత్తులో భాగంగా బీజేపీకి, పలాసను జనసేనకు కేటాయిస్తురన్న ప్రచారంతో నేతలు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. శ్రీకాకుళం టీడీపీ ఇన్‌ఛార్జ్ గుండె లక్ష్మీదేవి కేడర్ వద్ద బోరున విలపిస్తే, కళా వెంకట్రావు అనుచరులు రోడ్డెక్కి నిరసన తెలిపారు.
మరోవైపు ఇంతవరకూ టీడీపీ ప్రకటించిన స్థానాలలో ఒక్క పలాస మినహా మిగిలిన 4 చోట్ల సొంత పార్టీలో గ్రూపుల గోల ఉంది. ఎచ్చెర్లలో కళాను కాదంటూ పొందూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కలిశెట్టి అప్పలనాయుడు మధ్య గ్రూప్ పాలిటిక్స్ ఉన్నాయి. శ్రీకాకుళంలో గుండా లక్ష్మీదేవి, శ్రీకాకుళం సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు గొండు శంకర్‌లమధ్య, పాతపట్నంలో కలమట వెంకటరమణ వర్సెస్ మామిడి గోవిందరావుల మధ్య గ్రూప్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. పాలకొండలోనూ కళాతో గిట్టక నిమ్మక జయకృష్ణను కాదంటోంది ఓ వర్గం. అయితే ఆయా నియోజకవర్గాల నేతల బలాబలాలను బట్టి చూస్తే ఆ అసమ్మతి ఒక లెక్కే కాదన్న వాదన ఉంది. అటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడే గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని కొందరు సీనియర్లే బాహాటంగా అంటున్నారట. ఈ మధ్య పాతపట్నంలో జరిగిన సమావేశంలో తన ప్రత్యర్థి మామిడి గోవిందరావును ప్రోత్సహిస్తున్నారని వేదికమీదే అచ్చెన్నాయుడినే నేరుగా అడిగేశారట కలమట వెంకటరమణ. ఉమ్మడి శ్రీకాకుళంజిల్లాలోని ఐదు నియోజకవర్గాల అభ్యర్థుల ఖరారు విషయంలో అచ్చెన్నాయుడి అధిష్ఠానాన్ని తప్పుదారి పట్టించి చక్రం తిప్పుతున్నారన్న వాదన వినిపిస్తోంది. ఏదిఏమైనా వైసీపీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి క్యాంపెయిన్ చేస్తుంటే.. సిక్కోలులోని 5 నియోజకవర్గాల్లో టీడీపీకి అభ్యర్థులెవరో తెలియక పార్టీ కేడర్ గందరగోళంలో ఉందట.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..