సింగపూర్ నుంచి కన్నవారిని చూసేందుకు వస్తే.. విధి ఆడిన వింత నాటకంలో ముగ్గురు దుర్మరణం!

ఎన్నో ఏళ్లుగా విదేశాల్లో ఉన్న చిన్న కుమార్తె ఇండియాకు రావడంతో ఆ వృద్ధ దంపతులు సంతోషపడ్డారు... అల్లుడు, కూతురు మనవళ్లతో కలిసి విహారయాత్రకు వెళ్లారు.. ఐదు రోజులపాటు సంతోషంగా గడిపార. స్వగ్రామానికి తిరుగు ప్రయాణం అయ్యారు. మరికొన్ని గంటల్లో వారు సొంత ఇంటికి చేరుకునేవారు. కానీ, అంతలోనే విధి వక్రీకరించింది.. వారు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పింద.. క్షణాల్లో ముగ్గురి ప్రాణాలు అనంత వాయువుల్లోకి కలిసిపోయాయి.. మృతులంతా కర్నూలు జిల్లా ఆదోని వాసులు కాగా సంఘటన మాత్రం కర్ణాటకలోని గొల్లల హట్టి గేటు వద్ద జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

సింగపూర్ నుంచి కన్నవారిని చూసేందుకు వస్తే.. విధి ఆడిన వింత నాటకంలో ముగ్గురు దుర్మరణం!
Nri Family Tragedy

Edited By:

Updated on: Jun 05, 2026 | 8:56 AM

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కుటుంబంలో జరిగిన ఈ ఘోర ప్రమాదం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆదోని ఎస్కేడీ కాలనీకి చెందిన గణేశ్వర్ రెడ్డి, ఇందిరమ్మల కుమార్తె సౌమ్య సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. సింగపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న రవికుమార్‌తో ఆమెకు వివాహం జరిగింది. గత కొన్ని ఏళ్లుగా సింగపూర్‌లోనే ఉంటున్న సౌమ్య, కన్నవారిని చూసేందుకు భర్త, పిల్లలతో కలిసి ఇండియాకు వచ్చింది. గత నెల 30న ఎయిర్‌పోర్ట్ నుండి నేరుగా తల్లిదండ్రులను కూడా తీసుకుని ఊటీతో పాటు పలు పుణ్యక్షేత్రాల సందర్శనకు కారులో వెళ్లారు. ఐదు రోజుల పాటు కుటుంబమంతా ఆనందంగా గడిపిన అనంతరం తిరిగి ఆదోనికి ప్రయాణమయ్యారు.

అయితే, కర్ణాటకలోని తుమకూరు జిల్లా గొల్లరహట్టి గేటు వద్దకు రాగానే వారు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు ఒక్కసారిగా కుదుపునకు గురై, ఎదురుగా వస్తున్న ఓమ్ని వాహనాన్ని బలంగా ఢీకొట్టి, పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో కారు ముందు సీట్లలో ఉన్న ఎయిర్ బ్యాగులు సకాలంలో తెరుచుకోవడంతో భర్త రవికుమార్, కుమారుడు చరిత్ర రెడ్డి స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. కానీ, మధ్య సీట్లో కూర్చున్న సౌమ్య, ఆమె తల్లిదండ్రులు గణేశ్వర్ రెడ్డి, ఇందిరమ్మ కూర్చున్న వైపు ఎయిర్‌బ్యాగ్‌లు సాంకేతిక కారణాల వల్ల తెరుచుకోలేదు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆ ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. కళ్లముందే భార్య, అత్తమామల శవాలను చూసి రవికుమార్ బిడ్డలను పట్టుకుని బోరున విలపించిన తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది.

ఇవి కూడా చదవండి

ఈ ప్రమాదంలో సౌమ్య కుమార్తె చార్వి వెన్నెముక విరిగి, రక్తపు మడుగులో తీవ్ర గాయాలతో పడిపోయింది.. ప్రస్తుతం ఆ చిన్నారి బెంగళూరు ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో మృత్యువుతో పోరాడుతోంది. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎప్పుడూ సంతోషంగా ఉండే గణేశ్వర్ రెడ్డి కుటుంబం ఇలా ఒక్కసారిగా రోడ్డు ప్రమాదంలో తుడిచిపెట్టుకుపోవడంతో ఆదోని ఎస్కేడీ కాలనీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. లాంగ్ డ్రైవ్‌లు లేదా సుదూర ప్రయాణాలు చేసేటప్పుడు వాహనాల కండిషన్‌తో పాటు అన్ని రకాల భద్రతా ప్రమాణాలను చెక్ చేసుకోవడం ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి నిరూపించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us