Corona Effect: కరోనా విషయంలో అసత్య ప్రచారం చేశారంటూ చంద్రబాబుపై కేసు నమోదు చేసిన కర్నూలు వన్ టౌన్ పోలీసులు.. ఆయనకు సీఆర్‌పీసీ 41(ఏ) కింద నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్‌కు బయలుదేరారు. సీఐ కళ వెంకటరమణ ఆధ్వర్యంలోని బృందం కర్నూలు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. మరికొన్ని గంటల్లో చంద్రబాబుకు ఈ నోటీసులు అందివ్వనున్నారు.
కర్నూలు కేంద్రంగా ఎన్440కే కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతోందంటూ చంద్రబాబు జనాలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మాసుపోగు సుబ్బయ్య అనే వ్యక్తి కర్నూలు వన్ టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. చంద్రబాబు నాయుడిపై ఐపీసీ 155, 505(1)(బీ)(2) సెక్షన్లతో పాటు 2005 ప్రకృతి వైపరీత్యాల చట్టంలోని సెక్షన్ 4 కింద కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ కె. ఫక్కీరప్ప వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి సీఆర్‌పీసీ 41(ఏ) కింద చంద్రబాబుకు ఇవాళ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిపారు. కరోనా కొత్త వేరియంట్‌పై చంద్రబాబుకు చేసిన ప్రకటనలకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని, వాటి ఆధారంగానే కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్పీ స్పష్టం చేశారు. కాగా, ఎన్440కే వేరియంట్‌కు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని, వదంతులు, అసత్య ప్రచారాలు చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Also read: