Kurnool: కర్నూలు ఉల్లి రైతులకు గుడ్‌న్యూస్..
ఉల్లి రేట్లు పడిపోవడంతో నష్టపోయిన కర్నూలు రైతులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. హెక్టారుకు రూ.50వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించింది. ఇందులో కేంద్రం నుంచి రూ.17,500, రాష్ట్రం నుంచి రూ.32,500 సాయం లభించనుంది. పూర్తి వివరాలు కథనం లోపల తెలుసుకుందాం పదండి ..

ఉల్లి రేటు లేక కష్టాల్లో ఉన్న కర్నూలు రైతులకు ప్రభుత్వం పెద్ద ఊరట కల్పించింది. మార్కెట్లో ఉల్లి ధరలు ఊహించని స్థాయిలో పడిపోవడంతో రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి, హెక్టారుకు రూ.50,000 ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించింది.
ఈ సాయంలో కేంద్ర ప్రభుత్వం వైపరిత్యాల నిధుల కింద హెక్టారుకు రూ.17,500 ఇస్తుంది. అదనంగా రాష్ట్ర ప్రభుత్వం హెక్టారుకు రూ.32,500 మంజూరు చేయనుంది. దీంతో మొత్తం రూ.50,000 సాయం రైతుల ఖాతాల్లోకి జమ కానుంది. అంటే, ఉల్లి పంట ఎంత రేటుకి అమ్మినా, ఎంత అమ్మినా ఈ సాయం మాత్రం రైతులకు అందుతుంది. అంటే పంట అమ్మకాలతో సంబంధం లేకుండా నేరుగా రైతు ఖాతాల్లోకి డబ్బు వస్తుంది. కర్నూలు జిల్లాలో ఉల్లి పంట వేసిన రైతులపై ఇప్పటికే అధికారులు సర్వే పూర్తి చేశారు. ఈ డేటా ఆధారంగా అర్హులైన రైతులకు సాయం అందించనున్నారు. జిల్లాలో మొత్తం 42,000 ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేశారు. మొత్తం 2.67 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరిగింది.
ఈ సీజన్‌లో ఉల్లి రేటు కిలోకు రూ.5 నుండి రూ.7 మధ్య ఉండటంతో, రైతులు పెట్టుబడులు కూడా తిరిగి పొందలేని స్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సాయం రైతులకి ఉపశమనం కలిగించనుంది. రైతుల ఖాతాల్లో ఈ నిధులు త్వరలోనే జమ కానున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఇది రైతుల భారం కొంతవరకు తగ్గించేలా ఉంటుందని భావిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




