
కర్నూలు, అక్టోబర్ 24: రెండు తెలుగు రాష్ట్రాల్లో కర్నూలు జిల్లా బస్సు ప్రమాద ఘటన పెను విషాదం మిగిల్చింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో నిద్రలో ఉన్న ప్రయాణికులు అనేక మంది సజీవ దహనమయ్యారు. కర్నూలు శివారు చిన్నటేకూరులో జాతీయ రహదారి 44పై శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ దారుణ ఘటన జరిగింది. బస్సును బైక్ ఢీకొట్టి ముందు భాగంలోకి దూసుకెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద వివరాలను కర్నూలు కలెక్టర్ డాక్టర్ సిరి డిఐజి కోయ ప్రవీణ్ మీడియాకు వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 41 మంది ప్యాసింజర్‌లు ఉన్నారు. ఇందులో 21 మంది సేఫ్. వీరిలో కొంతమంది చికిత్స పొందుతుండగా మరికొంతమంది ప్రాథమిక చికిత్స అనంతరం క్షేమంగా వెళ్లిపోయారు. ఇక ప్రమాదంలో 11 మంది మృతి చెందినట్లు ఆయన నిర్ధారించారు. మిగిలిన 9 మంది గురించి ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. బస్సులోనే ఏమైనా ఉండిపోయారా లేక బస్సు దిగి ఎక్కడికైనా దిగిపోయారా అనే సమాచారం లభించలేదన్నారు. వారి వివరాలు కూడా సేకరిస్తున్నామన్నారు. డీఎన్ఏ ద్వారా మృతదేహాలను వారి బంధువులకు అప్పగిస్తామని తెలిపారు.
ఈ విషాద ఘటన జరిగిన ప్రాంతానికి ఏపీ ట్రాన్స్‌పోర్ట్ కమీషనర్ ఐపిఎస్ మనీష్ కుమార్ సిన్హా చేరుకున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో సంఘటన స్థలానికి చేరుకున్న ట్రాన్స్పోర్ట్ కమీషనర్ ప్రమాదానికి గల కారణాలపై నివేదిక ఇవ్వనున్నారు. అలాగే సంఘటన స్థలానికి రావాలని మూడు జిల్లా అధికారులకు ఆదేశం జారీ చేశారు. ఇక కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం చాలా బాధాకరమని అన్నారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. మృతులకు 2 లక్షలు, గాయపడిన వారికి 50 వేలు ప్రధాని మోదీ ఎక్స్-గ్రేషియా ప్రకటించారు. కర్నూల్‌లో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు చనిపోయారన్న వార్తలు దిగ్బ్రాంతికి గురి చేశాయన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారంతా క్షేమంగా ఉండాలని, సంపూర్ణంగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. కర్నూల్ బస్సు ప్రమాదం లో 20 మందికి పైగా చనిపోవడం దురదృష్టకరమని, మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి అని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సంతాపం తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కూడా కర్నూల్ జిల్లా బస్ ప్రమాదం పైన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపిన డిప్యూటీ సీఎం.
కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్రెడ్డితో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తక్షణమే ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వెంటనే హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సాయం అందించేందుకు జెన్కో సీఎండీ హరీష్ వెంటనే ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. గద్వాల కలెక్టర్, ఎస్పీ అక్కడే అందుబాటులో ఉండాలని, బాధిత కుటుంబాలకు అండదండగా ఉండాలని సూచించారు. మృతుల గుర్తింపుతో పాటు క్షతగాత్రులకు అవసరమైన వైద్యసాయం అందించే చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.