Andhra Pradesh: అయ్యో దేవుడా.. బైక్‌పై ఉన్నది ఇతడే.. పెళ్లి చూపులు చూస్తున్న సమయంలోనే..

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో బైకర్‌ శివశంకర్‌తో సహా 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. బైక్‌ను ఢీకొట్టి 300 మీటర్లు లాక్కెళ్లడం వల్ల మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. బైక్ నడుపుతున్న వ్యక్తిని శివశంకర్‌గా పోలీసులు గుర్తించారు.

Andhra Pradesh: అయ్యో దేవుడా.. బైక్‌పై ఉన్నది ఇతడే.. పెళ్లి చూపులు చూస్తున్న సమయంలోనే..
Biker Sivasankar Identified In Kurnool Bus Tragedy

Updated on: Oct 24, 2025 | 2:31 PM

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ దారుణ ఘటనలో ఒక బైకర్‌తో సహా 20 మందికి ప్రాణాలు కోల్పోయారు. బస్సు బైక్‌ను ఢీకొట్టడంతోనే మంటలు చెలరేగి ఈ ఘోరం జరిగింది. బైక్ నడుపుతున్న వ్యక్తిని శివశంకర్‌గా పోలీసులు గుర్తించారు. ఇతడు కర్నూలు మండలం ప్రజానగర్‌కు చెందిన వ్యక్తి అని తెలిపారు. గ్రానైట్, పెయింటింగ్ పనులు చేసే శివశంకర్ డోన్ నుంచి తన ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కర్నూలు జిల్లా ఆస్పత్రికి శివశంకర్ మృతదేహాన్ని తరలించారు. మార్చురీ దగ్గర అతడి కుటుంబసభ్యులు బోరు విలపించారు. పెళ్లి చూపులు చూస్తున్న సమయంలో ఇలా జరగడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. రాత్రి 9:30కి శివశంకర్‌.. ఫ్యామిలీతో ఫోన్‌లో మాట్లాడాడు. ప్రతిరోజూ రాత్రి 8 గంటలకే ఇంటికి వచ్చేవాడని.. కానీ ఈ సారి రాలేదని చెప్పారు. అసలు ప్రమాదం ఎలా జరిగిందో తెలియడం లేదని అన్నారు.

హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్‌కు చెందిన ఈ ప్రైవేట్ బస్సు.. బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత బస్సు బైక్‌ను దాదాపు 300 మీటర్లు లాక్కెళ్లింది. ఈ ఘటనలో బైక్ పెట్రోల్ ట్యాంక్ పగిలిపోయి, బైక్‌ను బస్సు లాక్కెళ్లడం వల్ల జరిగిన ఘర్షణతో మంటలు చెలరేగి బస్సుకు వ్యాపించాయి. బస్సులో మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రయాణికులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు దాదాపు 20 మృతదేహాలను అధికారులు వెలికితీశారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, పది మంది మహిళలు ఉన్నట్టు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ఉన్నారు. ప్రమాదం నుంచి 23 మంది క్షేమంగా బయటపడ్డారు.

డీఎన్‌ఏ టెస్టులు

మంటల్లో మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వాటిని గుర్తించేందుకు అధికారులు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాతే మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో నుంచి దూకిన కొందరు ప్రయాణికులకు కాళ్లు, తలకు గాయాలయ్యాయి. వీరిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నలుగురికి వైద్యం అందిస్తున్నారు. ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన ఏపీ హోం మంత్రి అనిత పరామర్శించారు.

పరిహారం ప్రకటన

ప్రమాదంలో మరణించిన తెలంగాణ కుటుంబాలకు రూ. 5 లక్షలు, గాయపడిన క్షతగాత్రులకు రూ. 2 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. బస్సు ఫిట్‌నెస్, అనుమతులు ఒడిశా పరిధిలోకి వస్తాయని అధికారులు తెలిపారు.