ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే సాదాసీదాగా రాజ్యాధికారాన్ని కైవసం చేసుకోలేదు. 151 సీట్లు సాధించిన వైఎస్ఆర్సీపీని మట్టికరిపించేలా అంతకు మించిన ఫలితాలతో విజయదుందుబి మోగించింది. మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు గానూ 164 స్థానాల్లో విజయం సాధించింది. ఇక ఎంపీల విషయానికొస్తే మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు గానూ 21 స్థానాలను కైవసం చేసుకుంది. ఈసారి చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా జూన్ 12న ప్రమాణస్వీకారం చేయనున్నారు. అందుకు ఏర్పాట్లనుకూడా పరిశీలిస్తున్నారు కొందరు పార్టీ నేతలు. అయితే ఈ కూటమి విజయం సాధించడంలో కీలక పాత్ర మేనిఫెస్టోదే అని అంటున్నారు కొందరు రాజకీయ పండితులు. వైఎస్ఆర్సీపీకి మించిన హామీలను చంద్రబాబు నాయుడు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అటు సంక్షేమం, ఇటు అభివృద్దిని సమానంగా పరుగులు పెట్టిస్తామన్న చంద్రబాబు మాటలకు ప్రజలు ముగ్ధులైనట్లు తెలుస్తోంది. అందులో ముఖ్యంగా సూపర్ సిక్స్ పేరుతో తీసుకొచ్చిన పథకాలు ప్రజల్లోకి బాగా దూసుకెళ్లాయి. వీటితో పాటు మరి కొన్ని కీలకమైన హామీలు అన్ని వర్గాలను ఆకర్షించాయన్నది కొందరి వాదన. అయితే ఆ టీడీపీ, జనసేన మేనిఫెస్టోలోని కొన్ని ముఖ్యమైన హామీలను ఇప్పుడు పరిశీలిద్దాం.
మెగా డీఎస్సీపై తొలి సంతకం అని నిరుద్యోగులకు మేలు జరిగేలా వాగ్ధానం చేశారు. అలాగే వృద్దాప్య పెన్షన్ నెలకు రూ. 3నుంచి 4వేలకు పెంచుతూ హామీ ఇచ్చారు. అది కూడా ఈ ఏప్రిల్ నుంచే అమలవుతుందని చెప్పారు చంద్రబాబు. అంటే ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి ఇప్పటికే వృద్దాప్య పెన్షన్ రూ. 3 వేలు ప్రకారం అవ్వాతాతలు తీసుకున్నారు. మిగిలిన రూ.1000 బకాయిలను మూడు నెలలకు రూ. 3వేలు కలిపి జూలై నెల కొత్త పెన్షన్‌తో మొత్తం రూ. 7వేలు అందిస్తామన్నారు. ఇంతేకాకుండా దివ్యాంగుల పెన్షన్ ను రూ. 6వేలకు పెంచారు చంద్రబాబు. దీంతో లబ్ధిదారులకు మరింత ఎక్కువ ప్రయోజనం చేకూరనుంది. వీటితో పాటు మరికొన్ని వర్గాలకు మేలు చేసేలా సరికొత్త హామీలు ఎన్నికల ప్రచారంలో తెరపైకి తీసుకొచ్చారు.
వీటితో పాటు ప్రత్యేక హోదా, పోలవరం, రాష్ట్ర అభివృద్ది, పెట్టుబడుల ఆహ్వానం, కంపెనీలు ఏర్పాటు, అమరావతి రాజధాని, వైజాగ్ ఆర్థిక రాజధాని ఇలా మొదలైనవి ఉన్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..