AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: మనిషి రూపంలో శివుడు.. పక్కకు చూసే నంది.. ఈ అద్భుత ఆలయం వీడియో చూస్తే..

ఏ గుడిలో చూసిన శివుడు లింగరూపంలోనే దర్శనమిస్తాడు. కానీ ఆ ఒక్క ఆలయంలో మాత్రం ఆ దేవదేవుడు సాక్షాత్తు సిద్ధాసనంలో కూర్చున్న ఒక మహాయోగిలా.. మానిషి రూపంలో దర్శనమిచ్చే అత్యంత అరుదైన పుణ్యక్షేత్రం గురించి మీకు తెలుసా? అది కూడా ఏపీలోనే ఉండడం గమనార్హం. ఆ అద్భుత ఆలయం గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Andhra Pradesh: మనిషి రూపంలో శివుడు.. పక్కకు చూసే నంది.. ఈ అద్భుత ఆలయం వీడియో చూస్తే..
Hemavathi Siddheswara Swamy Temple
Nalluri Naresh
| Edited By: |

Updated on: Aug 27, 2026 | 12:09 PM

Share

దేశంలోని ఏ శైవక్షేత్రానికి వెళ్లినా పరమేశ్వరుడు లింగాకారంలోనే దర్శనమిస్తాడు. కానీ అందుకు పూర్తి భిన్నంగా భోళా శంకరుడు సాక్షాత్తు ఒక యోగిలా, మానవ రూపంలో దర్శనమిచ్చే అత్యంత అరుదైన ఆధ్యాత్మిక అద్భుతం శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం హేమావతి గ్రామంలో కొలువై ఉంది. శిల్పకళా వైభవానికి నిలువెత్తు నిదర్శనమైన ఈ సిద్ధేశ్వరస్వామి ఆలయం, ఇక్కడి విచిత్ర నంది విగ్రహం చరిత్రకారులను, భక్తులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఒకప్పుడు హెంజేరుగా పిలువబడిన హేమావతి ప్రాంతం.. 7వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం వరకు పాలించిన నోళంబ పల్లవుల రాజధానిగా విలసిల్లింది. నోళంబ రాజుల కులదైవమైన ఈ సిద్ధేశ్వరుని ఆలయం చోళుల కాలంలోనూ విశేష ప్రాభవాన్ని పొందింది. ఈ ఆలయంలోని రాతి స్తంభాల సున్నితమైన చెక్కడాలు, శిల్పకళా చాతుర్యానికి ముగ్ధుడైన రాజేంద్ర చోళుడు.. కొన్ని స్తంభాలను తన రాజధానికి తరలించుకుపోయాడంటే ఇక్కడి కళా నైపుణ్యం ఎంతటి మహోన్నతమైనదో అర్థం చేసుకోవచ్చు. ఆలయ ప్రాంగణంలో నల్లరాతిపై చెక్కిన రామాయణ, మహాభారత ఘట్టాలు, వినూత్న రాతి కిటికీలు ప్రాచీన కాలపు శిల్పకళా వైభవానికి సాక్ష్యంగా నిలుస్తాయి.

పక్కకు చూసే నంది..

ఈ క్షేత్రం ప్రధాన ప్రత్యేకత స్వామివారి స్వరూపమే. గర్భాలయంలో శివుడు లింగరూపంలో కాకుండా జటాజూటం, నాలుగు చేతులు, ప్రశాంత వదనంతో సిద్ధాసనంలో కూర్చున్న ఒక దివ్య యోగి రూపంలో దర్శనమిస్తాడు. ఇలాంటి మానవాకార శివుని దర్శిస్తే సమస్త కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయంలో మరో ఆశ్చర్యకరమైన విశేషం ఇక్కడి నంది విగ్రహం. సాధారణంగా శివాలయాల్లో నంది నేరుగా స్వామివారి వైపు చూస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ నంది విగ్రహం కొద్దిగా పక్కకు తిరిగి ఉండటం గమనించవచ్చు. అంతేకాకుండా వందల ఏళ్ల నాటి ఈ నంది విగ్రహం చెవి భాగంలో ఒక పెద్ద రంధ్రం కనిపిస్తుంది. పూర్వకాలంలో రాజులు ఈ నంది చెవి లోపల అమూల్యమైన వజ్ర, వైడూర్యాలు, బంగారు ఆభరణాలను దాచిపెట్టారని.. ఆ తర్వాతి కాలంలో నిధుల కోసం దుండగులు చెవి భాగాన్ని పగలగొట్టారని స్థానిక చారిత్రక కథనం ప్రచారంలో ఉంది.

హేమావతి సిద్ధేశ్వరస్వామి ఆలయంలో ఏటా మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏడు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అరుదైన మానవాకార శివుని దర్శించుకునేందుకు, ప్రత్యేక అభిషేకాలు, అగ్నిగుండం మహోత్సవాలలో పాల్గొనేందుకు మడకశిర పరిసర ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రమైన కర్ణాటక నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలివస్తారు.

వీడియో చూడండి..

Follow Us