టీడీపీ అధినేత చంద్రబాబుకు లక్ష ఓట్ల మెజారిటీ ఆ పార్టీ టార్గెట్. చంద్రబాబు ఓటమే వైసీపీ ప్లాన్. ఎన్నికలకు ఇంకా నోటిఫికేషనే రాలేదు. ఎన్నికలకు రెండు నెలలుకు పైగా సమయం కుడా ఉంది. అయితే కుప్పంలో మాత్రం గత 3 నెలలుగా ఎన్నికల హడావుడి తారస్థాయికి చేరింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావితం చూపే కులాల ఓట్ల కోసం కుల రాజకీయాలకు ప్రధాన పార్టీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతో హాట్ టాపిక్‌గా మారిన కుప్పం కుల రాజకీయాల పట్ల ఆసక్తి నెలకొంది. ఇందులో భాగంగానే ప్రతిరోజు పోటాపోటీగా ఒకే కులానికి చెందిన టీడీపీ, వైసీపీ నాయకుల మీడియా సమావేశాలు కుప్పం రాజకీయాన్ని మరింత హీట్ పుట్టిస్తున్నాయి. కుప్పంలో బలమైన సామాజిక వర్గాలైన వన్యకుల క్షత్రియ, కురబ, గాండ్ల, బలిజ కులాలకు పార్టీలు ప్రాధాన్యతను ఇస్తున్నాయి. ఇప్పటికే వన్యకుల క్షత్రియుల కమ్యూనిటీ భవనం ప్రారంభ సమయంలో ప్రోటోకాల్ వివాదంతో కుల సంఘాల మధ్య విభేదాలు షురూ అయ్యాయి. తమ కులానికి మేలు చేసింది చంద్రబాబే అంటూ ఒక వర్గం, కాదు కాదు వైసీపీనే న్యాయం చేసిందని మరో వర్గం పోటాపోటీ ఆరోపణలకు దిగుతూ సమావేశాలు చేపట్టాయి. దాదాపు 2.24 లక్షల ఓటర్లు ఉన్న కుప్పం అసెంబ్లీలో వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానిదే ఆధిపత్యం. 55 వేలకుపైగా ఓటర్లున్న వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన భరత్‌ను ఎమ్మెల్సీని చేసి కుప్పం వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగిస్తున్నా.. మరోవైపు చిత్తూరు జిల్లా పార్టీ బాధ్యతలను కూడా అప్పగించింది. దీంతో కుప్పంలో వన్నెకుల క్షత్రియ సామాజికవర్గానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు ఆ పార్టీ ప్రచారం చేసుకుంటోంది.
మరోవైపు కురబ ఓట్లపై కన్నేసిన రెండు పార్టీలు క్యాస్ట్ పాలిటిక్స్‌కు తెరలేపాయి. కురబల ఆరాధ్య దైవమైన కనకదాసు విగ్రహాన్ని కుప్పం ప్రభుత్వ ఆసుపత్రి సర్కిల్‌లో మంత్రి పెద్దిరెడ్డి చేతుల మీదగా గత డిసెంబర్ 6న ఆవిష్కరించిన వైసీపీ.. ఆ సామాజికవర్గాన్ని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేసింది. ఇక అప్పటి నుంచే కుప్పంలో క్యాస్ట్ పాలిటిక్స్ ఈక్వేషన్స్ రెండు పార్టీలకు ఇంపార్టెంట్ అయ్యాయి. టీడీపీ కూడా కురబ సామాజిక వర్గం ఓట్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. గత డిసెంబర్ 26న కుప్పంలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు కురభ భవన్ వద్ద పోటీగా కనకదాసు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక గాండ్ల కులం ఓట్ల కోసం కూడా రెండు పార్టీలు సై అంటే సై అంటున్న పరిస్థితి కుప్పంలో నెలకొంది. గాండ్ల సామాజికవర్గానికి చెందిన సెంథిల్‌కు వైసీపీ అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. ముందు నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ముఖ్య అనుచరుడిగా కొనసాగుతున్న సెంధిల్‌కు రెస్కో చైర్మన్ పదవి కట్టబెట్టి కొనసాగిస్తోంది. కుప్పం నియోజకవర్గంలో ఎంతో ప్రాధాన్యత ఉన్న రెస్కో చైర్మన్ పదవిలో కొనసాగుతున్న సెంధిల్.. గాండ్ల సామాజికవర్గాన్ని వైసీపీ వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 45 వేల ఓట్లు ఉన్న గాండ్ల సామాజికవర్గంలో ఉన్న కీలక నేత సెంథిల్ ఒక సమావేశం ఏర్పాటు చేస్తే.. టీడీపీలో ఆ సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ, మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు గౌనివారి శ్రీనివాసులు ఈ నెల 11న టీడీపీకి అనుకూలంగా మరో సమావేశం ఏర్పాటుకు పిలుపునిచ్చారు. ఇక కుల సంఘాల ఆత్మీయ సభలకు సమావేశాలకు మీడియాను దూరంగా ఉంచుతున్న రెండు పార్టీలు సోషల్ మీడియాలో మాత్రం విస్తృత ప్రచారం చేసుకుంటున్నాయి. సోషల్ మీడియాలో ఎవరికి వారు ఆయా పార్టీల గురించి పోస్టింగులు, కామెంట్స్ తీవ్ర స్థాయిలో చేసుకుంటున్నాయి. దీంతో ఇప్పుడు కుప్పంలో ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్‌గా మారింది. కుప్పం చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా ఈ ఎన్నికల్లో కుల రాజకీయాలు తెరపైకి రావడంతో ఇతర ఓటర్ల మధ్య ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
కుప్పంలో దాదాపు 25 వేలకు పైగా ఓటింగ్ ఉన్న బలిజల కోసం రెండు పార్టీలు తంటాలు పడుతున్నాయి. బలిజ భవన్‌తో పాటు శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని కూడా ఇప్పటికే మంత్రి పెద్దిరెడ్డి ఆవిష్కరించడంతో ఆ సామాజికవర్గంలోనూ కుల రాజకీయం షురూ అయ్యింది. కుప్పంలో టీడీపీకి పట్టున్న బలిజ సామాజికవర్గం ఆ పార్టీకి అనుకూలంగా ఆత్మీయ సమావేశం నిర్వహించేందుకు హడావుడి చేస్తోంది. ఇలా కులాల మధ్య విభేదాలు రాజకీయ పార్టీలకు కలిసి వచ్చే అంశంగా మారిపోవడంతో కుప్పం రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కురబల ఓటింగ్ కోసం కనకదాసు విగ్రహన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రబాబు పోటాపోటీగా రెండు విగ్రహలను ఆవిష్కరించడం చూస్తే కుల రాజకీయం కుప్పంలో ఏ స్థాయిలో నడుస్తుందో అర్థమవుతుంది. ఇదే రీతిలో వన్నెకుల క్షత్రియలకు రూ.2 కోట్లతో వైసీపీ సర్కార్ వన్యకుల క్షత్రియ భవన్‌ను నిర్మించగా భవన నిర్మాణానికి స్థలం, నిధులు ఇచ్చింది చంద్రబాబేనని టీడీపీ చెప్పుకుంటోంది. ఇక గాండ్ల కులానికి రెండు ఎకరాల స్థలం కేటాయించి కళ్యాణ మండపం నిర్మాణానికి రూ. 2 కోట్లు మంజూరు చేసేందుకు ప్రపోజల్ చేసింది వైసీపీ సర్కార్. త్వరలోనే కుప్పంలో జరిగే సీఎం జగన్ పర్యటనలో ఈ మేరకు ప్రకటన చేయనుంది.
ఇక 2 నెలల్లో రానున్నది టీడీపీ ప్రభుత్వమేనంటున్న ఆ పార్టీ.. గాండ్లకు తగిన ప్రాధాన్యత ఇస్తామంటూ తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. కుప్పంలో మిగిలిన ఎస్సీ, ఎస్టీ ఓటర్లు 35 వేలకు పైగా ఉంటే.. ముస్లిం ఓటర్లు 20వేల దాకా ఉన్నారు. ఈ రెండు సామాజిక వర్గాలపైనా దృష్టి సారించిన రెండు ప్రధాన పార్టీలు.. అంబేద్కర్ భవనాలు, కమ్యూనిటీ భవనాల నిర్మాణాలపై హామీలు ఇస్తున్నాయి. ఒక్కో సామాజిక వర్గానికి చెందిన ఓటర్లకు గాలం వేస్తున్న రెండు పార్టీలు.. హామీలు, ఇప్పటికే చేసిన పనులు చెప్పుకుంటూ ఒక్కో కులంలో రెండు వర్గాలను ప్రోత్సహిస్తుండటంతో కుప్పంలో క్యాస్ట్ పాలిటిక్స్ పీక్స్‌కు చేరుకున్నాయి.