చిత్తూరు జిల్లాలో దుండగులు రెచ్చిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు, టీడీపీ నేత కిషోర్ కుమార్ రెడ్డి వాహనంపై కొందరు వ్యక్తులు దాడికి తెగబడ్డారు. కురబల కోట మండలం అంగళ్లు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఆయన వాహనంపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో కిషోర్ కుమార్ వెంట ఉన్న మరో టీడీపీ నేత మధుబాబుకి తీవ్రంగా గాయాలయ్యాయి.
వివరాల్లోకెళితే.. శుక్రవారం నాడు టీడీపీ జాతీయ కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి, రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, తంబళ్లపల్లి టీడీపీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే శంకర్ కలిసి కురబల కోట మండలం అంగళ్లులో టీడీపీ కార్యకర్తను కలిసేందుకు వెళ్తున్నారు. ఆ సమయంలో అంగళ్లులో వీరి వాహనాలపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో టీడీనీ నేతలకు చెందిన కార్ల అద్దాలు పగిలిపోయాయి. దుండగుల చర్యతో ఆగ్రహానికి గురైన కిశోర్ కుమార్, ఇతర టీడీపీ నేతలు రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డుపై బైఠాయించిన టీడీపీ నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేసి తరలించారు. కాగా, తమపై వైసీపీ మద్దతుదారులే దాడికి పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే టీడీపీకి చెందిన మరో వర్గం నేతలే ఈ దాడులకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీకి చెందిన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
దాడిని తీవ్రంగా ఖండించిన నారా లోకేష్..
ఇదిలాఉండగా, అంగళ్లులో టీడీపీ నేతలపై జరిగిన దాడిని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. కిషోర్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి పరామర్శించారు. వైసీపీ నేతలే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. వైసీపీ దాడులకు భయపడేది లేదని లోకేష్ స్పష్టం చేశారు. ఎన్ని దాడులు చేసినా ప్రజా సమస్యలపై టీడీపీ పోరాటం కొనసాగుతుందన్నారు. దాడికి బాధ్యులైన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత డీజీపీదే అని అన్నారు.