Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag Steel: తెలుగు మంత్రుల చేతుల్లో కీలక శాఖలు.. వైజాగ్‌ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆగుతుందా.. సాగుతుందా..?

కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి ఊపిరి అందిస్తున్న టీడీపీ..స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రకటన విడుదల చేయించాలని పలు వర్గాలు కోరుతున్నాయి. కూటమి ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపుతుందని నమ్మకంతో స్థానికులు భారీ విజయాన్ని అందించారని.. ఆ నమ్మకాన్ని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Vizag Steel: తెలుగు మంత్రుల చేతుల్లో కీలక శాఖలు.. వైజాగ్‌ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆగుతుందా.. సాగుతుందా..?
Vizag Steel Plant
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 13, 2024 | 8:40 PM

తెలుగోడి ఉక్కు సంకల్పానికి.. పరీక్షగా నిలుస్తోంది విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం. స్టీల్‌ప్లాంట్‌కు కీలకమైన ఉక్కు, బొగ్గు, గనుల శాఖలు తెలుగు నేతల చేతుల్లోకి రావడంతో.. గంపెడు ఆశలు పెట్టుకున్నారు..స్టీల్‌ ఉద్యోగులు. మరి విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సంబంధించి స్థానికుల ఆందోళన ఏంటి ? తాజా శాఖల నేపథ్యంలో ఉక్కు కర్మాగారం ఫ్యూచరేంటి? కేంద్రం చేపట్టిన స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆగుతుందా..?

విశాఖ ఉక్కు…ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను..2021లో అమ్మకానికి పెట్టింది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం. ప్లాంట్‌లో 100 శాతం వాటా విక్రయించడంతో పాటు రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ నుంచి వైదొలగాలని కేంద్రం నిర్ణయించుకుంది. స్టీల్‌ ప్లాంట్‌ మేనేజ్‌మెంట్‌ బాధ్యతలతో సహా పూర్తిగా ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకుంది. కేంద్ర నిర్ణయంతో భగ్గుమన్న కార్మిక సంఘాలు, వామపక్షాలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అప్పటినుంచి అలుపెరగని పోరాటాలు చేస్తూనే ఉన్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ అంశంగా కూడా మారింది విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అంశం. అయితే స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను కార్మిక సంఘాలు, స్థానికులు వ్యతిరేకిస్తున్నా కూడా ముందడుగే వేసింది కేంద్రం ప్రభుత్వం.

గత అయిదేళ్లుగా విశాఖ ఉక్కు పరిశ్రమ పీకల్లోతు కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. సొంత గనులు లేకపోవడంతో తరచూ ఉత్పత్తికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉద్యోగులు, కార్మికులకు జీతాలివ్వలేని పరిస్థితి కూడా నెలకుంటోంది. అయితే ఇటీవల ఏర్పడిన కేంద్రమంత్రివర్గంలో తెలంగాణకు చెందిన కిషన్‌రెడ్డికి బొగ్గు, గనుల శాఖ మంత్రిగా.. ఏపీకి చెందిన శ్రీనివాసవర్మకు ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రిగా ప్రధాని మోదీ అవకాశమిచ్చారు. దీంతో స్టీల్‌ప్లాంట్‌పై ఏపీ ప్రజల్లో మళ్లీ ఆశలు మొదలయ్యాయి. అప్పుల భారంతో కుంగిపోతోన్న ఉక్కు పరిశ్రమకు బొగ్గు గనులు కేటాయిస్తే…కష్టాలు తొలగే అవకాశముందని ప్లాంటు ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ మెడ మీద బీజేపీ కత్తి పెట్టి మూడేళ్లుగా బలహీనం చేస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. స్టీల్‌ప్లాంట్‌లో ప్రస్తుతం పూర్తి స్థాయి ఉత్పత్తి జరగడం లేదు. అందుకు అవసరమైన నిధులు, ముడిపదార్థాలు లేవు. ఇక్కడ ఏడాదికి 80 లక్షల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయవచ్చు. దీని ద్వారా 50 వేల కోట్ల ఆదాయం వస్తుంది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జీఎస్‌టీ ద్వారా 18 శాతం అంటే రూ.9 వేల కోట్లు ఆదాయం వస్తుంది. అయితే ఇవన్నీ జరగాలంటే స్టీల్‌ ప్లాంటు నిర్వహణకు అవసరమైన నిర్వహణ మూలధనం సమకూర్చాలి. బ్యాంకుల నుంచి రుణం దొరకాలంటే.. రాష్ట్రపతి పేరిట ఉన్న ఉక్కు భూములను ఆర్‌ఐఎన్‌ఎల్‌ పేరిట మార్పించాలి. అప్పుడే సంస్థకు ఆర్థిక పరపతి పెరిగి మార్కెట్‌లో రుణాలు లభిస్తాయి. ఇపుడు సరైన సమయం వచ్చింది కాబట్టి బీజేపీ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా చేయాలని అధికార, కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయంపై కేంద్రంతో మాట్లాడతానన్నారు..ఉక్కు శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసవర్మ. స్టీల్ ప్లాంట్ ఏపీ ప్రజలకు సెంటిమెంట్‌ అన్న ఆయన.. ప్రైవేటీకరణ ఆపేలా కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తానన్నారు. ప్రజలకు మేలు జరిగేలా అడుగులు వేస్తానని హామీ ఇచ్చారు.

కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి ఊపిరి అందిస్తున్న టీడీపీ..స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రకటన విడుదల చేయించాలని పలు వర్గాలు కోరుతున్నాయి. కూటమి ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపుతుందని నమ్మకంతో స్థానికులు భారీ విజయాన్ని అందించారని.. ఆ నమ్మకాన్ని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర విభజన హామీలైన కడప, బయ్యారం స్టీల్‌ప్లాంట్‌ల ఏర్పాటు హామీలపై కూడా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..