Andhra Pradesh: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై భూమన కరుణాకర్ రెడ్డి సంచలన కామెంట్స్..
కాశీబుగ్గ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 9 మంది భక్తులు మృతి చెందడంపై వైసీపీ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మాన ప్రసాదరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ దుర్ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. ప్రతి ఏటా అధిక సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినా.. వారికి కనీస సౌకర్యాలు, భద్రత కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ ఘటనలో 9మంది భక్తులు మృతి చెందడం తనను కలచివేసిందని అన్నారు. ఈ దుర్ఘటనకు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని.. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు.
గతంలో తిరుపతి, సింహాచలం ఇప్పుడు కాశీబుగ్గ తొక్కసలాట ఘటనలు ప్రభుత్వ అసమర్ధతను స్పష్టం చేస్తున్నాయని భూమన విమర్శించారు. సుమారు 20 వేల మంది భక్తులు వస్తారని అంచనా ఉన్నప్పటికీ.. వారికి కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం అయ్యిందని ఆరోపించారు. ఈ ప్రభుత్వం భక్తుల యోగక్షేమాలు పట్టించుకోకుండా.. కేవలం వైసీపీ నాయకులపై హిందూ వ్యతిరేక ముద్ర వేసే ప్రయత్నంలోనే ఉందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఇకనైనా మేల్కొని భక్తుల భద్రతపై దృష్టి సారించాలని భూమన కరుణాకర్ రెడ్డి హితవు పలికారు.
పాలనా వైఫల్యం వల్లే కాశీబుగ్గ దుర్ఘటన జరిగిందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. దైవ దర్శనానికి ప్రతి ఏటా ఈ రోజున పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారనే విషయం ప్రభుత్వానికి, అధికారులకు తెలియదా అని ప్రశ్నించారు. ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ.. పోలీసులు ఎందుకు సరైన భద్రత కల్పించలేకపోయారని నిలదీశారు. ఈ దుర్ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో జరిగిన ఇలాంటి అనుభవాల నుంచి కూడా ప్రస్తుత ప్రభుత్వం పాఠాలు నేర్చుకోలేదని ధర్మాన విమర్శించారు.
ఎలా జరిగిందంటే..?
మరోవైపు కాశీబుగ్గ ఆలయంలో సరైన చర్యలు చేపట్టకపోవడంతోనే తొక్కిసలాట జరిగిందని భక్తుల ఆరోపిస్తున్నారు. అధికారులు మాత్రం 3 వేల మంది భక్తుల కోసం ఏర్పాట్లు చేశామని.. కానీ ఇవాళ ఏకాదశి కావడంతో 25 వేల మందికి పైగా భక్తులు వచ్చినట్టు తెలుస్తోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు పోట్టెత్తడంతో కంట్రోల్ చేయడంలో అధికారులు విఫలమయ్యారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
