
కల్తీమద్యం కేసులో జోగి రమేష్ అరెస్ట్‌తో ఏపీలో పొలిటికల్ తుఫాన్ మొదలైంది.. జోగి రమేష్ అరెస్ట్‌పై వైసీపీ అధినేత స్పందించారు. రమేష్ ను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ వైసీపీ అధినేత జగన్ ట్వీట్ చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో నకిలీ మద్యం తయారీ జరిగితే తమ పార్టీ నేతలను అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. సమస్యలు, వైఫల్యాలను తప్పుదొవ పట్టించేందుకు అరెస్టు చేశారంటూ జగన్ పేర్కొన్నారు. సీబీఐ విచారణ జరపాలని పిటిషన్ వేసిన మరుసటిరోజే.. జోగి రమేష్‌ను అరెస్ట్ చేయడం సరికాదన్నారు. భయంతో చంద్రబాబు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని ఆరోపించారు.
కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే జోగి రమేశ్ అరెస్ట్ జరిగిందన్నారు మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్. నకిలీ మద్యం కేసుపై సీబీఐ విచారణ ఎందుకు జరపడంలేదని ప్రశ్నించారు.
తన భర్త తప్పు చేసినట్టుగా.. కూటమి నేతలు ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు జోగి రమేష్ భార్య శకుంతల దేవి. తన భర్తపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
వైసీపీ నేతల విమర్శలకు అధికార కూటమి కౌంటర్ ఇస్తోంది. జోగి రమేష్ అండ్ టీమ్ తయారుచేసింది నకిలీ మద్యం కాదు.. స్లో పాయిజన్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. దుర్గమ్మ సన్నిధిలో జోగి రమేశ్ అసత్య ప్రమాణం చేశారు కాబట్టే.. అమ్మ ఆగ్రహించిందన్నారు. జోగి అరెస్ట్‌తో తన పేరు బయటకు వస్తుందని జగన్ భయపడుతున్నారంటూ కామెంట్ చేశారు బుద్ధా వెంకన్న.
ఇదే కేసులో జోగి రమేష్ ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రామును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఆయన స్టేట్‌మెంట్ రికార్డ్ చేసి విడిచిపెట్టారు. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది వైసీపీ.. ఇదిలాఉంటే.. జోగి రమేష్ అరెస్ట్ తర్వాత పాలిటిక్స్ హీటెక్కడంతోపాటు.. నెక్ట్స్ టార్గెట్ ఎవరనేది.. చర్చనీయాంశంగా మారింది..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..