Pawan Kalyan: రాజ్యాంగ నిర్మాత బాబా సాహేబ్ అంబేద్కర్ తన హీరో అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆయనపై అపారమైన గౌరవం ఉందన్నారు. వెనుకబడిన, అణగారిన కులాలకు అండగా ఉంటానని మాట ఇచ్చానని పవన్ పేర్కొన్నారు. అధ్యయనం, ఉద్యమం, నిర్మాణం అనే పదాలు చాలా బలమైనవని, ఒక మార్పు కోసం తాను ప్రయత్నిస్తున్నానని చెప్పారు. ఆదివారం నాడు ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన పవన్.. 2019 ఓటమి తరువాత తాను పార్టీ వదిలిపెట్టి పోతానని అంతా భావించారన్నారు. అయితే, తాను ప్రజల కోసం పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. తన వద్ద అపరిమిత ధనం లేదని, ప్రజల కోసం పని చేయాలనే తపన ఉందన్నారు. ఎన్టీఆర్ లాంటి మహానటుడితో పోటీ పడలేమన్నారు. వెంటనే అధికారం చేపట్టాలనేది తన కోరిక కాదన్నారు. పాలసీపరంగా నిర్ణయాలు ఉండాలి తప్ప.. వ్యక్తిగతంగా ఉండకూడదన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ధైర్యంగా ముందుకు వెళ్తానన్నారు. రాష్ట్ర విభజన తరువాత అన్నీ ఆలోచించే అప్పుడు టీడీపీకి మద్ధతు ఇచ్చానన్నారు. ఆనాడు అమరావతి రాజధానిగా అంగీకరించి.. నేడు 3 రాజధానులు అంటారా? అని వైసీపీ ప్రభుత్వాన్ని పవన్ ప్రశ్నించారు.
బస్సు యాత్ర వాయిదా..
ఇదిలాఉంటే తాను చేపట్టనున్న బస్సు యాత్ర వాయిదా వేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అక్టోబర్‌లో బస్సు యాత్ర చేపడతానని గతంలో ప్రకటించానని, కానీ, ఇప్పుడు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. పార్టీ సన్నద్ధతపై కొన్ని సూచనలు వచ్చాయన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపి 45 నుంచి 67 స్థానాలకే పరిమితం కానుందని సర్వేలు వచ్చాయని పవన్ కల్యాణ్ తెలిపారు. అదే సమయంలో రాష్ట్రంలో జనసేనకు ఆదరణ పెరుగోందన్నారు. అన్ని రకాలుగా ఆలోచించి యాత్ర వాయిదా వేస్తున్నామన్నారు. కౌలు రైతుల భరోసా యాత్ర జనసేన – జనవాణిని పూర్తి చేస్తామన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..