AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JanaSena Party: వారంతా కౌలు రైతులు కాదని చెప్పగలరా..? సీఎం జగన్ వ్యాఖ్యలపై జనసేన ఆగ్రహం..

రాష్ట్రంలో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకొంటుంటే నిమ్మకు నీరెత్తినట్లు ఉన్న జగన్ రెడ్డి తాను రైతు బిడ్డను అని చెప్పుకొంటున్నారు.. అందుకు సిగ్గుపడాలి అంటూ జనసేన నేత నాదేండ్ల మనోహర్ పేర్కొన్నారు.

JanaSena Party: వారంతా కౌలు రైతులు కాదని చెప్పగలరా..? సీఎం జగన్ వ్యాఖ్యలపై జనసేన ఆగ్రహం..
Janasena Nadendla Manohar
Shaik Madar Saheb
|

Updated on: May 16, 2022 | 5:58 PM

Share

Nadendla Manohar on AP CM YS Jagan: రైతులను మోసం చేయడంలో సీబీఐ దత్తపుత్రుడు సీఎం జగన్ రెడ్డిని మించినవాళ్లు ఉండరని.. రైతులను కులాలవారీగా విభజించిన ప్రభుత్వమిదేనంటూ జనసేన విమర్శించింది. వాస్తవంగా వైసీపీ చెప్పిన ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వ నిధులకు కేంద్ర ప్రభుత్వం నిధులు కలుపుకొంటే ప్రతి రైతుకు రూ.19,500 రావాలి. కానీ ఇస్తున్నది రూ.13,500 మాత్రమే అంటూ జనసేన ఆగ్రహం వ్యక్తంచేసింది. అంటే ఒక్కో రైతు మీదా రూ.6 వేలు జగన్ ప్రభుత్వం మిగుల్చుకొంటోందని.. దీనికి ఏం సమాధానం చెబుతారంటూ ప్రశ్నించింది. ఈ మేరకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ సోమవారం ప్రకటన విడుదల చేశారు. ‘‘రాష్ట్రంలో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకొంటుంటే నిమ్మకు నీరెత్తినట్లు ఉన్న జగన్ రెడ్డి తాను రైతు బిడ్డను అని చెప్పుకొంటున్నారు. అందుకు సిగ్గుపడాలి. ఆయన చంచల్ గూడ బిడ్డ అని అందరికీ తెలుసు. ఈ రోజు గణపవరంలో ముఖ్యమంత్రి హోదాలో సి.బి.ఐ. దత్తపుత్రుడు చేసిన ప్రసంగం.. తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్రపై అక్కసు వెళ్లగక్కడానికే సరిపోయిందన్నారు. పరిహారం అందని ఒక్క రైతు కుటుంబాన్నీ చూపలేకపోయారు అనడం ముఖ్యమంత్రి అవగాహన రాహిత్యాన్ని వెల్లడిస్తోంది’’ అని మనోహర్ విమర్శించారు.

‘‘పవన్ కళ్యాణ్ అనంతపురం, పశ్చిమగోదావరి, కర్నూలు జిల్లాల్లో పర్యటించి 200 కౌలు రైతు కుటుంబాలను పరామర్శించారు. వారికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేశారు. ఈ 200 మంది కౌలు రైతులు కాదు అని జగన్ రెడ్డి చెప్పగలరా? పోలీసు రికార్డుల్లో స్పష్టంగా రాశారు… కౌలుకి భూమి తీసుకొని అప్పుల పాలై ఆత్మహత్య చేసుకొన్నారు అని. జీవో 102, 43లను అనుసరించి ఎందుకు రూ.7 లక్షలు ఇవ్వడం లేదు. మెజారిటీ కేసుల్లో త్రిసభ్య కమిటీ సభ్యులు కూడా ఆత్మహత్య చేసుకున్నవారి కుటుంబాల దగ్గరకు వెళ్ళడం లేదు. కొన్ని కుటుంబాలను త్రిసభ్య కమిటీ కూడా విచారించింది. వారికి కేవలం రూ.లక్ష పరిహారం ఇచ్చి సరిపెట్టారు. కౌలు రైతు కాని పక్షంలో అధికారులు వెళ్ళడం, కంటి తుడుపుగా పరిహారం ఇవ్వడం చేయరు కదా. మేము ఆర్థిక సాయం చేసినవారికి సంబంధించిన వివరాలు, పోలీసు రికార్డుల్లో ఏం రాశారో చూపిస్తాం.. అప్పుడు సిబిఐ దత్తపుత్రుడు ముఖం ఎక్కడ పెట్టుకొంటారు?’’ అంటూ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు.

వైసీపీ ప్రభుత్వం గత మూడేళ్లుగా ఎలాంటి ప్రణాళిక లేకుండా, రైతు శ్రేయస్సు పట్టించుకోకుండా చేస్తున్న పరిపాలన వల్ల రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారు. ఈ ప్రభుత్వం తెచ్చిన కౌలు రైతు చట్టం- కౌలుకి వ్యవసాయం చేసుకొనే పేదలకు రుణాలు కూడా రాకుండా చేస్తోంది. కౌలు రైతులకు ఇచ్చే అర్హత కార్డులు కూడా రాకుండా చేస్తున్నారు. ఫలితంగా వారికి బ్యాంకులు రుణాలు, పంట నష్ట పరిహారం, బీమా ఏవీ వర్తించడం లేదు. రైతులను కులాలవారీగా విభజించి లబ్ధి అందించాలనే ఆలోచన చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే – అది వైసీపీ ప్రభుత్వమేనంటూ నాదేండ్ల పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ప్రభుత్వ నిధుల నుంచి రూ.7 లక్షలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి బాధపడిపోతున్నారు. పవన్ కళ్యాణ్ తన కష్టార్జితం నుంచి ప్రతి కుటుంబానికి రూ.లక్ష ఇస్తున్నారన్నారు.

ఇవి కూడా చదవండి

జగన్ రెడ్డికి రైతులపట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రతి కౌలు రైతుకీ రైతు భరోసా వర్తింపచేయాలి. అలాగే ఆత్మహత్య చేసుకున్న ప్రతి కౌలు రైతు కుటుంబానికీ రూ.7 లక్షల ఆర్థిక సాయం అందించాలి. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా? చిత్తశుద్ధి లేకుండా ఇష్టానుసారం మాట్లాడి, గొప్పలు చెప్పుకొన్నా రైతులు విశ్వసించరు. వాస్తవాలు ఏమిటో రైతాంగానికి తెలుసంటూ నాదెండ్ల మనోహర్ ప్రకటనలో పేర్కొన్నారు.