జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర రెండో ఫేజ్ షెడ్యూల్ ఖరారైంది. ఏలూరు నుంచి రెండో విడత యాత్ర చేపట్టాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈనెల 9వ తేదీ సాయంత్రం 5గంటలకు ఏలూరులో నిర్వహించే బహిరంగసభతో యాత్ర ప్రారంభమవుతుందని జనసేన పార్టీ నేత పి.హరిప్రసాద్ తెలిపారు. వారాహియాత్రి రెండో దశ గురించి చర్చించేందుకు హైదరబాద్ నుంచి గన్నవరం వచ్చిన పవన్.. మంగళగిరి పార్టీ కార్యాలయంలో రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో సుదీర్ఘంగా చర్చించారు. ఇవాళ మరోసారి పార్టీ నేతలతో భేటీ అవుతారు పవన్. ఈ భేటీలో ఏలూరుతో పాటు దెందులూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల నాయకులతో స్థానిక రాజకీయ పరిస్థితులపై పవన్ చర్చించనున్నారు.
ఇక పవన్ కల్యాణ్ చేపట్టిన తొలి విడత వారాహి యాత్ర సూపర్ సక్సెస్ అయింది. వారాహి యాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. ఎక్కడ సభ పెట్టినా.. ఇసుకేస్తే రాలనంతగా ప్రజలు, జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు తరలివచ్చారు. నిండుగా కనిపించిన పవన్ సభలు అధికార, ప్రతిపక్ష పార్టీల్లో సైతం ఆందోళన కలిగించాయి. అయితే వారాహి తొలి విడత యాత్ర మొత్తం ప్రజా సమస్యలపై.. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అధికార పార్టీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో రెండో విడత యాత్రపై జనసేన పార్టీ, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దృష్టి సారించారు. పశ్చిమగోదావరి నుంచే యాత్ర కొనసాగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..