Pawan kalyan: ఉద్యోగులు రోడ్డు మీదకు రావడం బాధ కలిగించింది.. వారికిచ్చిన హామీలను నెరవేర్చాలి : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

Andhra Pradesh PRC: ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ రచ్చ కొనసాగుతూనే ఉంది. ఉద్యోగులు తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా పీఆర్సీ సాధన సమితి నేడు ‘ఛలో విజయవాడ' (Chalo Vijayawada)  కార్యక్రమానికి పిలుపునిచ్చింది.

Pawan kalyan: ఉద్యోగులు రోడ్డు మీదకు రావడం బాధ కలిగించింది.. వారికిచ్చిన హామీలను నెరవేర్చాలి : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌
Pawan Kalyan
Follow us
Basha Shek

|

Updated on: Feb 03, 2022 | 9:34 PM

Andhra Pradesh PRC: ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ రచ్చ కొనసాగుతూనే ఉంది. ఉద్యోగులు తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా పీఆర్సీ సాధన సమితి నేడు ‘ఛలో విజయవాడ’ (Chalo Vijayawada)  కార్యక్రమానికి పిలుపునిచ్చింది. మరోవైపు పోలీసులు ఈ కార్యక్రమానికి అనుమతులు ఇవ్వకపోవడంతో బెజవాడలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కాగా ఇలా రోడ్ల మీదకు ఉద్యోగులు వచ్చి నిరసన తెలపడం చాలా బాధ కలిగించిందని జనసేన (Janasena) పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) తెలిపారు. ఉద్యోగులను కించపరిచే మాటలు, బెదిరించే ధోరణిని మానుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి పవన్‌ సూచించారు. ఉద్యోగుల నిరసనకు జనసేన పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

సీపీఎస్‌ హమీ ఏమైంది? ‘అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ విధానం రద్దు చేస్తాం… ఏ ప్రభుత్వం చేయని విధంగా జీతాలు పెంచుతామని హామీ ఇచ్చిన వైసీపీ ఇప్పుడు మాట తప్పింది. ఆనాడు ఉద్యోగులకు హామీ ఇచ్చిన నాయకులు ఈనాడు మాట మార్చడం సబబు కాదు. అధికారంలోకి రావడానికి ఒక మాట, అధికారంలోకి వచ్చాకా మరో మాట మాట్లాడం మోసపూరిత చర్యగా జనసేన భావిస్తోంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెరగాలి, కానీ అందుకు విరుద్ధంగా జీతాలు తగ్గించడం ఉద్యోగులను వంచనకు గురి చేయడమే. మండుటెండలో నిలబడి లక్షలాది మంది ఉద్యోగులు నిరసన తెలపడం చాలా బాధ కలిగించింది. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేసిన పాపానికి వందల మందిని అరెస్టులు చేయడం, లాఠీ చార్జ్ చేయడం దురదృష్టకరం. ప్రతి ఉద్యోగీ పీఆర్‌సీ ద్వారా జీతం పెరుగుతుందని భావిస్తారు. అందుకు అనుగుణంగా పిల్లల చదువుల ఖర్చు, ఇతర ఖర్చులకు ఒక బడ్జెట్ ప్రణాళిక వేసుకుంటారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా ఉద్యోగుల బాధలు తెలుసు. ఈ రోజున వైసీపీ నాయకుల ఆదాయం మూడు రెట్లు పెరిగితే, ఉద్యోగుల జీతాలు 30 శాతం తగ్గాయి. అధికారంలోకి వచ్చేందుకు సీపీఎస్‌ రద్దు చేస్తాం, జీతాలు పెంచుతాము అన్నారు. ఇప్పుడు అడిగితే అప్పుడు తగిన అవగాహన లేకుండా చెప్పాం అని అంటున్నారు. ఇది కచ్చితంగా ఉద్యోగులను మోసపుచ్చడమే.

చర్చల పేరుతో అవమానించారు! ‘వివిధ శ్లాబులుగా ఉన్న హెచ్ఆర్ఏను రెండు శ్లాబులకు కుదించడం వల్లే ఒక్కొక్కరికీ రూ.5 వేలు నుంచి రూ. 8 వేలు వరకు జీతం తగ్గిందని ఉద్యోగులు చెబుతున్నారు. దీనిపై ఉద్యోగులు పలుసార్లు విన్నవించుకున్నారు. సంబంధిత మంత్రులు కానీ, అధికారులు కానీ పట్టించుకోకపోవడం, చర్చలకు పిలిచి అర్ధరాత్రి వరకు వెయిట్ చేయించడం, అవమానించేలా మాట్లాడం వల్లే ఈ రోజు లక్షలాది మంది ఉద్యోగులు రోడ్లు మీదకు వచ్చారు. ఉద్యోగులను చర్చల పేరుతో పిలిచి అవమానించారు. ఉద్యోగుల నిరసనకు కారణం ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యమే. ఈ విషయం గురించి ముందే స్పందిద్దామనుకున్నాను కానీ.. ప్రభుత్వంతో చర్చలు జరిపిన ఉద్యోగ సంఘాల నాయకులు వేరే రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేయదలుచుకోలేదని చెప్పడంతో ఒక అడుగు వెనక్కి తగ్గాను. ఉద్యోగులు అడిగినప్పుడు మాత్రం కచ్చితంగా మద్దతు ఇవ్వాలని మా పార్టీ నాయకులకు కూడా సూచించాను .

జనసేన పూర్తి మద్దతు! వైసీపీ నాయకులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఉద్యోగులు, ఎన్‌జీవోలు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు తమ డిమాండ్ల కోసం సమ్మెకు సన్నద్ధమవుతున్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం సుహృద్భావ వాతావరణంలో చర్చలు చేపట్టాలి. ఉద్యోగులను అవమానించేలా, రెచ్చెగొట్టేలా మాట్లాడకూడదు. వారి న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలి. ఉద్యోగుల నిరసనకు జనసేన పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది’ అని పవన్‌ పేర్కొన్నారు.

Also Read:Hero Movie: ఓటీటీలో అడుగుపెట్టనున్న మహేశ్‌ మేనల్లుడి సినిమా.. స్ర్టీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..

Sara Alikhan: అలాంటి పిచ్చి కామెంట్లకి నేను కుంగిపోను.. ట్రోలర్‌కి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన సారా..

AHA Unstoppable: సీక్రెట్‌గా ఎందుకు పెళ్లి చేసుకున్నావ్‌? బాలయ్య ప్రశ్నకు మహేశ్‌ రియాక్షన్‌ చూడండి..