NTR Health University: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షపార్టీలు జగన్ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్చి ఏం సాధిస్తారని అధికార పక్షాన్ని ప్రశ్నించారు. ‘పేరు మార్పుతో రాష్ట్రంలో వైద్య వసతులు మెరుగవుతాయా? మౌలిక వసతులను వదిలిపెట్టి విశ్వ విద్యాలయం పేరు మార్చడంలో అర్థం లేదు. బోదకాలు, టైఫాయిడ్ లాంటి రోగాలకు మందులు కనుగొన్న యల్లాప్రగడ సుబ్బారావు గారి పేరుని కనీసం ఒక్క సంస్థకైనా ఈ పాలకులు పెట్టారా? ఇంట్లోవాళ్ల పేర్లు ప్రజల ఆస్తులకు పెట్టే ముందు ప్రజల కోసం జీవితాలను ధారపోసిన మహనీయుల గురించి పాలకులు తెలుసుకోవాలి. పాలకులు మారినప్పుడల్లా పేర్లు మార్చుకుంటూ వెళ్తే ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు’
‘పేర్లు మార్చాలి అనుకొన్న పక్షంలో విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి పేరు మార్చవచ్చు కదా. ఆ పేరు ఇంకా బ్రిటిష్ వాసనలతో ఉంది కదా. స్వాతంత్ర్య అమృతోత్సవాలు చేసుకున్నాం గనక విశాఖ కేజీహెచ్ పేరు మార్చి వైద్య ప్రముఖులలో ఒకరి పేరు పెట్టండి. వైద్య విశ్వ విద్యాలయానికి ఆ రంగంలోని ప్రముఖుల పేరు పెట్టాలనే చిత్తశుద్ధితో కూడిన ఆలోచన ఉండి ఉంటే యల్లాప్రగడ సుబ్బారావు గారి పేరును పరిగణించండి. ప్రజల దృష్టిని పక్కదోవ పట్టించేందుకో.. కొత్త వివాదాలు సృష్టించేందుకో వైసీపీ ప్రభుత్వం ఇలాంటి పనులు చేస్తోంది’ అని జనసేనాని విమర్శించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..