తనకు సమస్యలు చెప్పుకున్న రైతులపై అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైనా వేధింపులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంట పొలాలను బుధవారం ఆయన సందర్శించారు. పంట నష్టం గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన పవన్.. అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరారు. తాము వస్తున్నామని అధికారులు హడావుడి చేయడం కాదని.. చిత్తశుద్ధితో రైతులకు న్యాయం చేయాలన్నారు.
రాష్ట్రంలోని ప్రతి రైతు సమస్య పరిష్కారం అయ్యే వరకు జనసేన పోరాటం చేస్తుందని పవన్ అన్నారు. దీని కోసం జనసేన పోరాటం కొనసాగిస్తుందన్నారు. తన దగ్గర గోడు వెళ్లబోసుకున్న రైతులపై దాడులు చేయడం, పోలీసు కేసులు పెట్టడం వంటి చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. అన్నం పెట్టే రైతన్నల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు.
మరిన్ని ఏపీ వార్తలు చదవండి..