రికార్డు స్థాయిలో జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష క్యాంపులు.. 3 కోట్లు దాటిన వైద్య ప‌రీక్షలు

| Edited By: Balaraju Goud

Oct 13, 2023 | 4:59 PM

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లు, వైద్య సిబ్బంది ప్రతి గడపకు వెళ్లి ప్రజలకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికీ 7 కీలక వైద్య పరీక్షలు చేసి అనారోగ్య సమస్యలు ఉంటే వైద్య సహాయానికి సూచనలు ఇస్తున్నారు.

రికార్డు స్థాయిలో జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష క్యాంపులు.. 3 కోట్లు దాటిన వైద్య ప‌రీక్షలు
Arogya Suraksha
Follow us on

ప్రజా ఆరోగ్యంపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పేదలకు కార్పొరేట్‌ వైద్యాన్ని మరింత చేరువ చేస్తోంది. ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష కార్యక్రమం రికార్డులు సృష్టిస్తుంది. సెప్టెంబ‌ర్ 30వ తేదీ నుంచి ప్రారంభ‌మైన ఈ కార్యక్రమం రెండు నెల‌ల‌పాటు నిర్విరామంగా కొనసాగుతోంది. జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష ద్వారా ఇంటింటింటికీ వైద్యప‌రీక్షలు నిర్వహిస్తున్నారు అరోగ్య కార్యకర్తలు. గ‌తంలో జ‌గ‌న‌న్న సుర‌క్ష కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున స‌ర్టిఫికేట్లు జారీ చేసిన ప్రభుత్వం.. తాజాగా ప్రతి ఇంటిలో అంద‌రికీ వైద్య ప‌రీక్షలు నిర్వహిస్తుంది.

ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వంతో పాటు పార్టీ కార్యకర్తలు సమన్వయంతో క‌లిసి నిర్వహించాల‌ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఇంట్లో జల్లెడ పట్టి ఆరోగ్య సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్కరించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు సీఎం జగన్‌. అవసరమైన పరీక్షలతో పాటు, మందులు, కళ్లద్దాలు ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటున్నామన్నారు.

దీంతో ప్రతి గ్రామ‌,వార్డు స‌చివాల‌య ప‌రిధిలో వాలంటీర్లు, ఇత‌ర సిబ్బంది క‌లిసి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటిని సంద‌ర్శిస్తున్నారు. ఇంటిలోని ప్రతి ఒక్కరికి అవ‌స‌ర‌మైన వైద్య ప‌రీక్షలు నిర్వహిస్తున్నారు. అవ‌స‌ర‌మైన వారికి ఇత‌ర ప్రత్యేక ప‌రీక్షలు కూడా చేస్తున్నారు. వైద్యుల‌తో ఉచితంగా క‌న్సల్టేష‌న్ కూడా ఇప్పిస్తున్నారు. ఇలా ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వం త‌ర‌పున ప్రత్యేక సేవ‌లు అందిస్తున్నారు. ఇలా రెండు నెల‌ల‌పాటు రాష్ట్రంలో ఉన్న కోటి 60 ల‌క్షల ఇళ్లను సంద‌ర్శించాల‌ని టార్గెట్‌గా ముందుకెళ్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే నెల‌రోజులు గ‌డువ‌క ముందే అనుకున్న దానికంటే ఎక్కువ శాతం కార్యక్రమాన్ని పూర్తి చేసింది స‌ర్కార్. జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష క్యాంపులు రికార్డు స్థాయిలో నిర్వహించింది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ.

మూడు కోట్లకు పైగా ప్రజ‌ల‌కు వైద్య ప‌రీక్షలు

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లు, వైద్య సిబ్బంది ప్రతి గడపకు వెళ్లి ప్రజలకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికీ 7 కీలక వైద్య పరీక్షలు చేసి అనారోగ్య సమస్యలు ఉంటే వైద్య సహాయానికి సూచనలు ఇస్తున్నారు. సెప్టెంబర్ 30 వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల వారీగా కార్యక్రమం ప్రారంభం అయింది. ఇప్పటివ‌ర‌కూ వైద్య శిబిరాల నిర్వహ‌ణ‌, వైద్య ప‌రీక్షల్లో అనుకున్న ల‌క్ష్యం కంటే వేగంగా ముందుకెళ్తుంది. ఇప్పటివరకు వరకు 5వేల 805 వైద్య శిబిరాలు నిర్వహించింది ప్రభుత్వం. ఈ శిబిరాలకు24ల‌క్షల‌75వేల మంది హాజ‌రైన‌ట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ శిబిరాల ద్వారా 23ల‌క్షల 70 వేల మంది వైద్యుల‌ను సంప్రదించిన‌ట్లు ప్రభుత్వం వెల్లడించింది.

మ‌రో నెల రోజుల పాటు వైద్య సేవలు

ఇక గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వెళ్లి ప్రతి ఇంటిలో ఉన్న వారికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు వైద్యారోగ్య సిబ్బంది. ఇప్పటివ‌ర‌కూ ఐదు కోట్ల 4 ల‌క్షల‌కు పైగా ర్యాపిడ్ టెస్ట్ లు నిర్వహించింది. ఇక ఇంటింటికి వెళ్లిన స‌మ‌యంలో మూడు కోట్ల 22 లక్షల మందికి ఆరోగ్య ప‌రీక్షలు చేసిన‌ట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇలా వైద్య ప‌రీక్షలు నిర్వహించిన స‌మ‌యంలో దీర్ఘకాలిక వ్యాధుల‌తో భాధ‌ప‌డుతున్న వారికి కూడా ప్రత్యేకంగా ప్రభుత్వ ఆసుప‌త్రుల్లో లేదంటే అవసరమైన ప్రయివేట్ ఆసుప‌త్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందించేలా ఏర్పాట్లు కూడా చేస్తుంది ప్రభుత్వం. ఇలా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి సంబంధించి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటూ జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష కార్యక్రమం
నిర్వహిస్తుంది. మ‌రో నెల రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి