ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ఏపీ ప్రభుత్వం భరోసానిచ్చింది. జూనియర్ డాక్టర్ల ఎక్స్‌గ్రేషియా డిమాండ్‌ను నెరవేర్చింది. కోవిడ్‌తో మరణించే వైద్యులు, సిబ్బందికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. కోవిడ్ విధి నిర్వహణలో మృతి చెందిన వైద్యుని కుటుంబానికి రూ.25 లక్షలు.. స్టాఫ్ నర్సుకి రూ.20 లక్షలు, ఎఫ్‌ఎస్‌ఓ లేదా ఎమ్‌ఎస్‌ఓలకు రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా.. ఇతర వైద్య సిబ్బంది మృతి చెందితే రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం చెల్లించే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ పథకానికి అదనంగా ఈ ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు ఉత్తర్వులలో వెల్లడించింది. తక్షణమే ఎక్స్‌గ్రేషియా అందేలా కలెక్టర్లకు అధికారం ఇచ్చింది. జిల్లా కలెక్టర్లు సంబంధిత డాక్యుమెంట్లు పరిశీలించి ఎక్స్‌గ్రేషియా ఇచ్చేలా ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు హెల్త్ హబ్స్ ఏర్పాటుపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. జిల్లాల్లో హెల్త్ హబ్స్ ఏర్పాటు విషయంలో కొన్ని సూచనలు చేశారు. జనావాసాలకు దగ్గరగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరాలు, పట్టణాలకు నలువైపులా ఆస్పత్రులు తీసుకువచ్చేలా ప్రణాళికలు ఉండాలని సీఎం సూచించారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలో పెద్ద ఆస్పత్రుల్లో ఉన్న అత్యాధునిక చికిత్సా విధానాలు, టెక్నాలజీ, సదుపాయాలు మన దగ్గర కూడా అందుబాటులోకి తేవడమే హెల్త్ హబ్స్ ప్రధాన ఉద్దేశమని సీఎం చెప్పారు. 2 వారాల్లోగా హెల్త్ హబ్స్‌పై విధివిధానాలు ఖరారు కావాలన్నారు.
Also Read: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 4549 కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా