
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార ప్రతిపక్షాలు ఎన్నికల వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఎవరికి వారే వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే తాము ఒంటరిగానే పోటీచేస్తున్నట్లు వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తెలుగుదేశం-జనసేన కలిసి వెళ్తున్నట్లు ప్రకటించాయి. అయితే తమతో పాటు భారతీయ జనతాపార్టీ కూడా కలిసివచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు రెండు పార్టీల నేతలు చెప్పుకొస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీని గద్దె దించడమే తమ లక్ష్యం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదేపదే చెప్పుకొస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ అధికారంలోకి రాకూడదని, అందుకే పొత్తులతో ముందుకెళ్తున్నామని చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం వల్ల వైసీపీకి మళ్లీ అధికారం దక్కుతుందని అంటున్నారు. ఇప్పటికే తెలుగుదేశం-జనసేన పార్టీలు క్షేత్ర స్థాయిలో కలిసి ముందుకెళ్తున్నాయి.
రెండు పార్టీల నేతలు సమన్వయంతో ముందుకెళ్లేలా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని స్థానాల్లో మినహా మిగిలిన చోట్ల రెండు పార్టీల నేతల మధ్య ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్తున్నారు. మరోవైపు బీజేపీతో పొత్తు అంశం కీలకంగా మారింది. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయిన తర్వాత స్తబ్దత నెలకొంది. అసలేం జరుగుతుందో మూడు పార్టీల కేడర్‌కు అర్ధం కాక గందరగోళంలో ఉన్నారు. ఇప్పటికే జనసేన ఎన్డీఏలో భాగస్వామిగా ఉండగా టీడీపీ చేరుతుందో లేదో అనే సందిగ్ధం కూడా నెలకొంది. ఇలాంటి సమయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఎన్డీఏలో చేరాలని తమకు ఆహ్వానం అందిందన్నారాయన. అందుకే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారని చెప్పుకొచ్చారు. త్వరలోనే అన్ని అంశాలపై స్పష్టత వస్తుందని అచ్చెన్నాయుడు చెప్పారు. దీంట్లో ఎలాంటి దాపరికం లేదన్నారు.
తెలుగుదేశం-జనసేన తో బీజేపీ పొత్తుపై వీలైనంత త్వరగా స్పష్టత వస్తుందని అచ్చెన్నాయుడు చెప్పారు. విజయవాడలో జరిగిన తెలుగుదేశం-జనసేన రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం తర్వాత అచ్చెన్నాయుడు ఈ వ్యాఖ్యలు చేసారు. మరోవైపు సమన్వయ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈనెల 28న పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం సమీపంలో పత్తిపాడు వద్ద టీడీపీ-జనసేన భారీ బహిరంగ సభ జరపాలని కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఈ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గోనున్నారు. సుమారు 5 లక్షల మంది సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తామన్నారు అచ్చెన్నాయుడు. సభ విజయవంతం చేసేందుకు టీడీపీ-జనసేన తరపున ఆరుగురు సభ్యుల చొప్పున కమిటీ నియమించాలని సమన్వయ కమిటీలో నిర్ణయించారు. మరోవైపు ఉమ్మడి మేనిఫెస్టో అంశంపైనా సమన్వయ కమిటీలో చర్చించారు.
ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తరపున ఆరు అంశాలు, జనసేన తరపున మరికొన్ని అంశాలను మేనిఫెస్టోలో పెట్టాలని నిర్ణయించారు. మహిళలు, రైతులకు సంబంధించి మరిన్ని అంశాలు మేనిఫెస్టోలో పెట్టేలా ప్రాధాన్యత ఇస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు మరో రెండు సార్లు చర్చించిన తర్వాత మేనిఫెస్టోకు తుదిరూపు వస్తుందని సమన్వయ కమిటీ సభ్యులు తెలిపారు. ఇక టీడీపీ-జనసేన టిక్కెట్ల కేటాయింపులో కొన్ని స్థానాల్లో వస్తున్న గొడవలపైనా కమిటీలో చర్చించారు. సీట్ల నిర్ణయం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌దేనని కొంతమంది త్యాగాలు చేయక తప్పదని అభిప్రాయపడ్డారు. సీట్ల అంశంలో విభేదాలు రాకుండా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సమన్వయ కమిటీల ద్వారా తగిన నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించారు. అయితే రెండు పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేసారు. సమన్వయ కమిటీ సమావేశంలో రెండు తీర్మానాలు చేసారు. టీడీపీ-జనసేన పొత్తును స్వాగతించిన పార్టీల కేడర్‌ను అభినందిస్తూ తీర్మానం చేసారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..