ఇప్పుడు కాంగ్రెస్‌లో కొత్త చర్చ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో టీ కాంగ్రెస్ నేతలు ఇన్వాల్వ్ చేస్తే ఎలా ఉంటుందనే దానిపై అధిష్టానం సమాలోచనలుచేస్తోంది. ఒకవేళ ఏపీలో ప్రచారం చేయాల్సి వస్తే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏ విధంగా వ్యవహరిస్తారనే దానిపై పార్టీలో ఇంట్రస్టింగ్ డిష్కషన్ జరిగినట్లు సమాచారం. తెలంగాణ మంత్రి వర్గంలో పలువురు మంత్రులు వైసీపీ అధినేత, సీఎం జగన్‌కు అనుకూలంగా ఉన్నవారు ఉన్నారు.
అదే సమయంలో తెలంగాణ సీఎం రేవంత్, మంత్రి సీతక్క లాంటి వాళ్లు టీడీపీ అధినేత చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నారనే ప్రచారం ఉండనే ఉంది. ఈ నేపథ్యంలో ఏపీకి వెళ్లి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తారా ? చేతులు ఎత్తేస్తారా ? అన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఎవరెవరితో ఎక్కడ ప్రచారం చేయించాలనే దానిపై లెక్కలు వేస్తున్నట్లు సమాచారం. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతో ఆ పక్కనే ఉన్న విజయవాడ చుట్టు పక్కల ప్రచారం చేయించాలని భావిస్తున్నారు. అదే జిల్లాకు చెందిన మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని రాయలసీమ జిల్లాలో ప్రచారం చేయిస్తే ఎలా ఉంటుందనే దానిపై చర్చ సాగుతోంది.
ఈ ఇరువురు నేతల్లో ఒకరు చంద్రబాబు మద్దతు దారు కాగా… మరొకరు జగన్ మద్దతుదారు. తుమ్మల నాగేశ్వర్ రావు తన ఎన్నికల ప్రచారంలో టీడీపీ నేతలతో సమావేశాలను కూడా నిర్వహించుకున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి… ఏపీ సీఎం జగన్ ప్రభుత్వంలో పలు కాంట్రాక్టు పనులు చేసుకున్నారని వార్తలు వచ్చాయి. నల్గొండ జిల్లాకు చెందిన మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ లతో గుంటూరు జిల్లాలో ప్రచారం చేయిస్తే ఎలా ఉంటుందనే దానిపై అధిష్టానం ఆలోచన చేస్తోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి … వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉంటారు. ఏపీకి వెళ్లి ఆయన జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా ? లేదా అన్నది చూడాలి. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావుతో కర్నూలు జిల్లాలో ప్రచారం చేయించే ఛాన్స్ ఉంది. ఈ నేతలు కాంగ్రెస్ తరుఫున ప్రచారం చేస్తారా ? తెలంగాణ వ్యవహారాల్లో బీజీగా ఉన్నామని తప్పించుకుంటారా ? అన్నది ఇప్పుడు ఇంట్రస్టింగ్ టాపిక్ గా మారింది.
ఇక తెలంగాణ సీఎం రేవంత్ ఏపీ పాలిటిక్స్‌లో ఎలాంటి పాత్ర పోషిస్తారనేది అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇప్పటికే ఏపీ సీఎం జగన్ కర్టసీగా తనకు కాల్ కూడా చేయలేదని రేవంత్ చెప్పిన నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో వైసీపీపై విమర్శలు ఎక్కుపెట్టే ఛాన్స్ ఉంది. షర్మిలతో కలిసి ఎన్నికల ప్రచారంలో రేవంత్ పాల్గొనేలా ప్లానింగ్ చేస్తున్నారు. ఇక ములుగు ఎమ్మెల్యే, మంత్రి సీతక్క… చంద్రబాబుకు అత్యంత సన్నిహితురాలు అనే పేరుంది. వీరిద్దరూ జగన్ పై మాత్రమే విమర్శలు చేస్తారా ? చంద్రబాబుపై అగ్రసివ్ గా మాటలు తూటాలు పేల్చుతారా ? ఏపీ కాంగ్రెస్ కు జీవం పోయడానికి తెలంగాణ మంత్రులు ఎలా వ్యవహరిస్తారో చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..