Andhra News: వావ్..! వాటే క్రేజీ ఐడియా.. బొకేలు, శాలువాలకి బదులు కూరగాయలు..

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. జనవరి ఒకటి ఏడాది ప్రారంభం రోజు కావడంతో ప్రభుత్వ, ప్రైవేటు, వర్తక, వ్యాపార సంస్థలలో ఉద్యోగులు,సిబ్బంది తమ పై అధికారులను, యాజమాన్య పెద్దలను కలుసుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఇక మరికొందరైతే తొలి రోజు దైవ దర్శనం చేసుకుంటే ఏడాదంతా బాగుంటుందన్న సెంటిమెంట్‌తో దేవాలయాలకు క్యూలు కట్టారు. దీంతో సందడి వాతావరణం నెలకొంది. ఇక రాజకీయ ప్రముఖుల నివాసాల వద్ద అయితే మరింత సందడి కనిపించింది.

Andhra News: వావ్..! వాటే క్రేజీ ఐడియా.. బొకేలు, శాలువాలకి బదులు కూరగాయలు..
Ram Mohan Naidu
Follow us
S Srinivasa Rao

| Edited By: Velpula Bharath Rao

Updated on: Jan 01, 2025 | 9:23 PM

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడ గ్రామానికి కూడా బుధవారం పండగ వాతావరణం వచ్చింది. మారుమూల గ్రామమైన నిమ్మాడలో కొత్త సంవత్సరం శోభ కొట్టొచ్చినట్టు కనిపించింది. దీనికి కారణం నిమ్మాడ రాజకీయ నేపథ్యం ఉన్న కింజరాపు కుటుంభం స్వగ్రామం కావడమే. కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడుల స్వస్థలం కావడంతో బుధవారం నిమ్మాడలో సందడి నెలకొంది. తమను కలిసేందుకు వచ్చిన వారి కోసం బుధవారం తన బాబాయి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అయిన అచ్చెన్నాయుడుతో కలిసి రామ్మోహన్ నాయుడు నిమ్మాడలోనే అందుబాటులో ఉన్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర మంత్రులిద్దరికి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపేందుకు అధికారులు, కార్యకర్తలు, అభిమానులు నిమ్మాడకు భారీగా తరలివచ్చారు.

అయితే నూతన సంవత్సర వేడుకలను మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, అచ్చెంనాయుడు నిమ్మాడలో వినూత్నంగా మంచి సందేశాన్ని ఇచ్చేలా జరుపుకొన్నారు. తమను కలిసి శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన వారి నుంచి పూలు, పూలబొకేలు, శాలువాలకు బదులుగా పుస్తకాలు, పెన్నులు, మొక్కలు, కూరగాయలు మాత్రమే మంత్రులు స్వీకరించారు. కేవలం అలాంటివి మాత్రమే స్వీకరించటం వల్ల వాటికి పునర్వినియోగానికి అవకాశం ఉండటంతో పాటు, పర్యావరణానికి హాని ఉండదన్నది మంత్రుల భావన. అలా వచ్చిన పుస్తకాలు, పెన్నులు, కూరగాయలు విద్యార్థులు చదువుకోడానికి, పేదల ఆకలి తీర్చడానికి ఉపయోగపడతాయన్నది వారి ఆలోచన. అందుకే కొత్త సంవత్సరం సందర్భంగా తమను కలిసేందుకు వచ్చేవారెవరైన తెస్తే పేద విద్యార్థులకు పనికి వచ్చే నోట్ పుస్తకాలు, పెన్నులు తెండి కానీ బొకేలు, శాలువాలు వంటివి తేవొద్దని మంత్రి అచ్చెన్నాయుడు రెండురోజుల ముందే పత్రిక ప్రకటన ద్వారా పిలుపునిచ్చారు. మంత్రి అచ్చెన్నాయుడు పిలుపుకు ప్రజల నుండి మంచి స్పందనే లభించింది. మంత్రులను కలిసేందుకు వచ్చిన అధికారులు, ప్రముఖులే కాదు సామాన్య గ్రామీణులు, సాధారణ కార్యకర్తలు సైతం నోట్ బుక్స్,పెన్నులు, కూరగాయలను తేవటం విశేషం. దివంగత నేత, కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు ప్రారంభించిన ఆనవాయితీని కొనసాగిస్తూ.. ఉదయాన్నే కుటుంబ సభ్యులు, పీఏసీఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్, అడిషనల్ ఎస్పీ (రిటైర్డ్) కింజరాపు ప్రభాకర్‌లతో కలిసి తమ నివాసంలో పూజలు చేశారు. అనంతరం ఎర్రన్నాయుడు చిత్రపటం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తమకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వారిని మంత్రులు కలుసుకున్నారు. నిమ్మాడలో మంత్రులను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు గొండు శంకర్, గౌతు శిరీష, మామిడి గోవిందరావు, ఎన్.ఈశ్వరరావు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ తదితరులు ఉన్నారు. ఇరువురు మంత్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి