AP News: తలనొప్పి, కళ్లు మసకబారడంతో ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. డాక్టర్లు ఏం చేశారో తెలిస్తే.!

| Edited By: Ravi Kiran

Mar 27, 2024 | 9:36 AM

మెదడులో ఏర్పడే ట్యూమర్లను తొలగించాలంటే క్లిష్టమైన శస్త్ర చికిత్సను చేయాల్సి ఉంటుంది. తలపై పెద్ద గాటు పెట్టి మెదడులోని ఇతర భాగాలు దెబ్బతినకుండా చేసే ఆపరేషన్లు అన్ని సార్లు విజయవంతం కావు.. పెద్ద గాటు పెట్టడం ద్వారా రక్తస్రావం ఎక్కువగా జరగటం, మెదడులోని ఇతర భాగాలు దెబ్బతినడం..

AP News: తలనొప్పి, కళ్లు మసకబారడంతో ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. డాక్టర్లు ఏం చేశారో తెలిస్తే.!
Representative Image
Follow us on

మెదడులో ఏర్పడే ట్యూమర్లను తొలగించాలంటే క్లిష్టమైన శస్త్ర చికిత్సను చేయాల్సి ఉంటుంది. తలపై పెద్ద గాటు పెట్టి మెదడులోని ఇతర భాగాలు దెబ్బతినకుండా చేసే ఆపరేషన్లు అన్ని సార్లు విజయవంతం కావు.. పెద్ద గాటు పెట్టడం ద్వారా రక్తస్రావం ఎక్కువగా జరగటం, మెదడులోని ఇతర భాగాలు దెబ్బతినడం, ఆపరేషన్ తర్వాత కోలుకోవడానికి అధిక సమయం పట్టడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే బ్రెయిన్ పాత్ సిస్టమ్ ద్వారా ఈ సమస్యలన్నింటికి చెక్ పెట్టవచ్చంటున్నారు గుంటూరు వైద్యులు పాటిబండ్ల మోహన్ రావు. ఈ విధానం ద్వారా దేశంలోనే మొట్ట మొదటి శస్త్రచికిత్సను ఆయన విజయవంతంగా గుంటూరులోని తన ఆసుపత్రిలో చేశారు.

భీమవరానికి చెందిన వెంకటేశ్వర్లు అనే రోగి విపరీతమైన తలనొప్పి, కళ్లు మసకబారడంతో పాటు ఇతర లక్షణాలతో గుంటూరులోని డాక్టర్ రావూస్ ఆసుపత్రికి వచ్చారు. అప్పటికే అనేక ఆసుపత్రుల చుట్టూ తిరిగి తలనొప్పి తగ్గకపోవడంతో చివరి ప్రయత్నంగా డాక్టర్ రావూస్‌కు వచ్చారు. అక్కడ అన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ పాటిబండ్ల మోహనరావు రోగికి బ్రెయిన్ గ్లియోమా ట్యూమర్ ఉన్నట్లు గుర్తించారు. ట్యూమర్‌ను ఆపరేషన్ చేసి తొలగించాలని రోగి బంధువులకు చెప్పారు. అయితే సాధారణ పద్దతిలో ఆపరేషన్ చేస్తే మెదడులోని ఇతర భాగాలకు ఇబ్బంది కలగడం, పుండు మానటానికి అధిక సమయం పట్టడం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయని చెప్పారు. అయితే బ్రెయిన్ పాత్ సిస్టమ్ ఉపయోగించి కీ-హోల్ సర్జరీ చేయడం ద్వారా ఇతర సమస్యలకు చెక్ పెట్టవచ్చని వైద్యులు సూచించారు. అయితే దేశంలో మొట్టమొదటిసారి ఇటువంటి శస్త్ర చికిత్స చేస్తున్నట్లు రోగి బంధువులకు చెప్పారు. వారు అంగీకరించడంతోనే ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆపరేషన్ తర్వాత రోగి పూర్తిగా కోలుకున్నారు.

Rare Surgery

బ్రెయిన్ పాత్ కీ-హోల్ సర్జరీ ద్వారా మెదడులోకి సంక్లిష్ట భాగంలో ఉన్న కణితిని కచ్చితంగా గుర్తించి దానిని విజయవంతంగా తొలగించినట్లు ఆయన చెప్పారు. ఈ తరహా ఆపరేషన్ ద్వారా బ్రెయిన్‌లోని ఇతర కణజాలం దెబ్బతినకుండా తలపై చిన్న గాటు సాయంతో రోగి త్వరగా కోలుకునేలా ఆపరేషన్ చేస్తామని చెప్పారు. ట్యూమర్‌ను గుర్తించడానికి ఎంఆర్ఐ, న్యూరో నావిగేషన్‌తో పాటు అధునాతన ఇమేజింగ్ పద్దతులను ఉపయోగించినట్లు తెలిపారు. కీ-హోల్ ఆపరేషన్లు పెద్ద సంఖ్యలో తమ ఆసుసత్రిలో చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అత్యంత అధునాతన వైద్య పరికరాలు, వైద్య పద్దతులను ఉపయోగించి గుంటూరులో మెదడుకు సంబంధించిన శస్త్ర చికిత్సలు చేస్తున్నట్లు డాక్టర్ మోహన రావు తెలిపారు. గుంటూరులాంటి సిటీలో దేశంలోనే మొట్టమొదటిసారి బ్రెయిన్ పాత్ సిస్టమ్ ద్వారా ఆపరేషన్ చేసిన మోహన్ రావును పలువురు వైద్యులు అభినందించారు.

Mohan Rao Patibandla

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..