Indian Railways: ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తిరుపతి రైల్వే స్టేషన్‌ అభివృద్ధి.. మాస్టర్ ప్లాన్ సిద్ధం

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ప్రముఖ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయానికి చేరుకునే తిరుపతి రైల్వే స్టేషన్‌కు ఈ ప్రాజెక్టులో అవకాశం కల్పించింది.

Indian Railways: ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తిరుపతి రైల్వే స్టేషన్‌ అభివృద్ధి.. మాస్టర్ ప్లాన్ సిద్ధం
Tirupati
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 31, 2022 | 9:48 PM

Tirupati railway station: దేశంలోని అన్ని రైల్వే జోన్లలోని ప్రధానమైన రైల్వే స్టేషన్లను పచ్చదనంతో అతి సుందరంగా తీర్చిదిద్ది.. ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా రైల్వే మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఈ మేరకు పలు రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ప్రముఖ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయానికి చేరుకునే తిరుపతి రైల్వే స్టేషన్‌కు ఈ ప్రాజెక్టులో అవకాశం కల్పిస్తూ ఇండియన్ రైల్వే నిర్ణయం తీసుకుంది. ‘ప్రధాన ‘రైల్వే స్టేషన్ల అభివృద్ధి’లో భాగంగా తిరుపతి స్టేషన్‌‌ను అభివృద్ధి చేయాలని ఇండియన్ రైల్వే ఆదేశాలు జారీ చేసింది. కొత్త నిర్మాణం ద్రవిడ ఆలయ నిర్మాణాల తరహా (Dravida temple structures) లో చేపట్టేందుకు డిజైన్‌ను రూపొందించింది.

ఈ మేరకు వినియోగదారులకు మౌలిక సదుపాయాలు, ప్రయాణికుల వసతులతోపాటు స్టేషన్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుకు దక్షిణ మధ్య రైల్వే మాస్టర్‌ ప్లాన్‌ను సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించి ఈపీసి విధానంలో వివిధ పనులను చేపట్టడానికి కాంట్రాక్ట్‌ ఇచ్చింది. దీని ప్రకారం.. తిరుపతి రైల్వే స్టేషన్‌‌ను అభివృద్ధి చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

Tirupati Station

మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులు.. ఇలా..

➼ పునాది స్థాయి, గ్రౌండ్‌G3 అంతస్తులతో దక్షిణం వైపు స్టేషన్‌ భవనం అభివృద్ధి

➼ గ్రౌండ్‌ G 3 అంతస్తులతో ఉత్తరం వైపు స్టేషన్‌ భవనం అభివృద్ధి

➼ స్టేషన్‌ భవనం ఉత్తరం – దక్షిణం వైపు అనుసంధానం చేస్తూ 35 మీటర్ల 2 ఎయిర్‌ కాన్కోర్స్‌ నిర్మాణం

➼ ప్రస్తుత ప్లాట్‌ఫారల అభివృద్ధి

➼ ప్లాట్‌ఫారలపై నూతనంగా పై కప్పు నిర్మాణం

Tirupati Railway Station

ప్రతిపాదిత అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేయనున్న వసతులు :

➼ దక్షిణం వైపు భాగంలో బేస్‌మెంట్‌ వద్ద పార్కింగ్‌ సౌకర్యం. గౌండ్‌ ఫ్లోర్‌లో బయలుదేరే ప్రయాణికుల ఆవరణ, చేరుకునే ప్రయాణికుల ఆవరణ, టికెట్‌ కౌంటర్‌, వ్రిశ్రాంతి గది. మొదటి, రెండవ అంతస్తులలో కామన్‌ విశ్రాంతి గది, మహిళల విశ్రాంతి గది, ఆహారశాల, మరుగుదొడ్లు, క్లాక్‌ రూము. మూడవ అంతస్తులో రైల్వే కార్యాలయాలు, విశ్రాంతి గదుల ఏర్పాటు.

➼ ఉత్తరం వైపు భాగంగా గ్రౌండ్‌ ఫ్లోర్‌లో బయలుదేరే ప్రయాణికుల ఆవరణ, చేరుకునే ప్రయాణికుల ఆవరణ, టికెట్‌ కౌంటర్‌, వ్రిశ్రాంతి గది. మొదటి అంతస్తులో కామన్‌ విశ్రాంతి గది, మహిళల విశ్రాంతి గది, విఐపి విశ్రాంతి గది, మరుగుదొడ్లు, క్లాక్‌ రూము. రెండవ అంతస్తులో విశ్రాంతి గది, దుకాణాలు, కియోస్కోలు, మరుగుదొడ్లు. మూడవ అంతస్తులో రైల్వే కార్యాలయాలు ఏర్పాటు.

➼ ఏయిర్‌ కాన్కోర్స్‌లో విశ్రాంతి గది, దుకాణాలు, ఆహార శాలలు, బెంచీల ఏర్పాటు.

➼ ప్రయాణికుల అవసరాలమేరకు 23 లిఫ్టులు, 20 ఎస్కలేటర్లు, సమాచారం తెలియజేసే డిస్‌ప్లే వ్యవస్థ, ప్రయాణికులకు వివరాలు అందజేసే వ్యవస్థ, సిసిటివి కెమరాలు, కోచ్‌ వివరాలు, రైళ్ల వివరాలు తెలియజేసే సూచిక బోర్డులు ఏర్పాటు.

Tirupati Railway Station

ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ (ఇన్‌చార్జి) శ్రీ అరుణ్‌ కుమార్‌ జైన్‌ మాట్లాడుతూ.. ప్రయాణికుల అన్ని రకాల అవసరాలను తీర్చేలా, భవిష్యత్తు అవసరాల మేరకు తిరుపతి రైల్వే స్టేషన్‌ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి పరచడానికి జోన్‌ నిబద్దతతో కట్టుబడి ఉందన్నారు. పనులు వేగవంతంగా చేపట్టి నిర్ధేశించిన సమయంలోగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. స్టేషన్‌లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాక తిరుపతి రైల్వే స్టేషన్‌ సుందరంగా ఆకర్షణీయంగా ఉంటుందని, ప్రాముఖ్యమైన స్టేషన్‌లో రైలు ప్రయాణికుల ఆక్షాంక్ష మేరకు వసతులు అందుబాటులో ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..