రాజకీయంగా చూస్తే.. మొదటి నుంచీ కాంగ్రెస్‌కు అనుకూలమైన స్థానం అనంతపురం అర్బన్. రాష్ట్ర విభజనతోనే ఏపీలో కాంగ్రెస్ రాజసం, చరిత్రలో కలిసిపోయింది కాబట్టి… ఇప్పుడా ప్లేసును వైసీపీ భర్తీ చేస్తోంది. ప్రస్తుతం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు అనంత వెంకట్రామిరెడ్డి. గతంలో నాలుగుసార్లు అనంతపురం ఎంపీగా గెలిచిన వెంకట్రామిరెడ్డిని… అనూహ్యంగా గతసారి ఎమ్మెల్యే బరిలో నిలిపింది వైసీపీ హైకమాండ్. జగన్ వేవ్‌లో… టీడీపీ అభ్యర్థి ప్రభాకర్ చౌదరిపై భారీ మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు మరోసారి గెలిచేందుకు.. కసరత్తులు తీవ్రతరం చేస్తున్నారు. గడపగడపకూ మన ప్రభుత్వం అంటూ.. అలా జనంలో ముందుకు వెళ్తున్నారు.
మరి, ఢిల్లీస్థాయి రాజకీయాలు చూసిన ఈ సీనియర్ మోస్ట్ లీడర్‌కు… మరోసారి అసెంబ్లీకి వెళ్లే అవకాశం ఉందా? అంటే… ఏమో రాజకీయాల్లో ఎప్పుడేమైనా జరగొచ్చన్న సమాధానం వినిపిస్తోంది. ఎమ్మల్యే అనంత విషయంలో సొంత పార్టీ కార్పొరేటర్లు సహా, నేతలెవరూ సంతృప్తిగా లేరనే టాక్ వినబడుతోంది. తమ సెగ్మెంట్లలో అభివృద్ధిపనులకు అవసరమైన నిధులు రాకపోవడంతో… జనాలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నామని గుస్సామీదున్నారట నేతలు. ఎన్నిసార్లు చెప్పినా.. ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి పట్టించుకోవడం లేదన్న ఆవేదనతో ఉన్నారట. దీంతో, ఈసారి ఈయన మాకొద్దు అనే ఫీలింగ్‌తో ఉన్నారట లోకల్ వైసీపీ లీడర్లు. మరి, వచ్చేసారి వెంకట్రామిరెడ్డికి టిక్కెట్ వస్తుందా? రాదా? అనే ప్రచారం ఎక్కువైంది.
అలాగని, అనంత వెంకట్రామిరెడ్డిని సాధారణ నాయకుడిగా అంచనా వేయడం కరెక్టు కాదేమో. గతంలో కాంగ్రెస్ తరపున నాలుగుసార్లు ఎంపీగా గెలిచి.. ఢిల్లీ స్థాయి రాజకీయాలు చూశారు. అయితే, రాష్ట్ర విభజన తర్వాత వైసీపీలో చేరి… 2014లో అనంతపురం ఎంపీగా బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జేసీ దివాకర్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. అధిష్టానం ఇచ్చిన అనూహ్యమైన అవకాశంతో… అనంతపురం అర్బన్ నుంచి 2019లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదేంటోగాని, ఢిల్లీ లెవెల్లో పాలిటిక్స్ మేనేజ్‌చేసిన ఆయన.. గల్లీ రాజకీయాల్ని మాత్రం హ్యాండిల్ చేయలేకపోతున్నారనే అభిప్రాయం ఏర్పడింది. పార్టీలో కార్యకర్తలకు న్యాయం చేయడం లేదన్న అపవాదు వెంటాడుతున్నా… ఎమ్మెల్యేగా జనంలోకి మాత్రం బాగా వెళ్తున్నారు. పోటీపై క్లారిటీ లేకపోయినా.. జగన్ చెప్పిందే శాసనం.. ఆయన మాటే వేదం అంటున్నారు.
మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి… సిట్టింగ్ సీటుకు ఎసరు పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. 2009లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. 2012లో జగన్ కోసం రాజీనామా చేసి మళ్లీ గెలిచిన గుర్నాథ్‌రెడ్డి… 2014లో ఓడిపోయారు. అయినా జగన్ మంచి ప్రయారిటీయే ఇచ్చారు. కాకపోతే, గుర్నాథ్‌రెడ్డి మాత్రం… అధికార పార్టీ టీడీపీ వైపు వెళ్లారు. అయితే, 2018లో మళ్లీ సొంతగూటికి చేరినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సీటు వెంకట్రామిరెడ్డికి కన్ఫామ్ అయిపోయింది. అలా రాంగ్ స్టెప్స్‌తో ఛాన్స్ మిస్ చేసుకున్న గుర్నాథ్‌రెడ్డి.. ఈ దఫా ఎలాగైనా పోటీచేసి తీరాలని… టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ సైతం ఇక్కడ బలంగానే ఉన్నా… గ్రూపు తగాదాలు కొంపముంచుతున్నాయ్. 2014లో ఇక్కడ పసుపు జెండా ఎగరేసిన ప్రభాకర్ చౌదరి… ఇక్కడ బలమైన నేతగా ఉన్నారు. వ్యక్తిగతంగా ఆయనకున్న ఇమేజ్ కూడా ఎక్కువే. అయితే, అనంతపురం అర్బన్‌లో ప్రభాకర్ చౌదరి వర్గం, జేసీ వర్గం అన్నట్టుగా తయారైంది టీడీపీ పరిస్థితి. ఏ ఒక్కరికి టిక్కెట్టిచ్చినా రెండవ వర్గం సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. అనంతపురం జిల్లా రాజకీయాల్ని శాసించాలనుకుంటున్న జేసీ ఫ్యామిలీ.. ఇక్కడ టీడీపీపై పట్టుకోసం ప్రయత్నిస్తుండటమే దీనికి కారణం. ప్రభాకర్ చౌదరి, జేసీ మధ్య సయోధ్య కుదరకపోతే… మరోసారి టీడీపీకి అపజయం ఖాయమన్న అభిప్రాయం తెలుగుతమ్ముళ్ల నుంచే వ్యక్తమవుతోంది.
విపక్షాల మధ్య పొత్తులు ఖరారైతే.. అర్బన్‌లో పొలిటికల్ పరిస్థితులు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇక్కడ జనసేన తరపున వపన్ కల్యాణ్ బరిలో ఉంటే.. బరి నుంచి తప్పుకొనేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు టీడీపీ నేత ప్రభాకర్ చౌదరి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పడంతో… కొత్త రాజకీయానికి తెరలేచింది. ఇక, మిగితా రాజకీయ పక్షాల విషయానికొస్తే… బీజేపీ, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీల ప్రభావం ఇక్కడ నామమాత్రమనే చెప్పుకోవాలి.
ఇక్కడప్రధానంగా రెండు ప్రధాన కులాల మధ్యే హోరాహోరి ఉంటుంది. ఎక్కువ సంఖ్యలో ఉండే ముస్లిం మైనార్టీలు, బలిజలు ఎవరికి మద్దతిస్తే.. వారిదే విజయం అన్నట్టుగా ఉంటుంది ఇక్కడి ఫలితం. ఎస్సీ మాదిగ, బోయ వర్గాలూ తమ ప్రభావం చూపిస్తుంటాయ్. అయితే, ఎవరి సంఖ్య ఎలాఉన్నా… రాజకీయంగా కమ్మవర్గానిదీ, రెడ్లదే ఇక్కడ పెత్తనం. ఇప్పటి వరకు ముస్లింలు.. వైసీపీ పక్షాన ఉన్నారు. వచ్చే దఫా ఎవరు ఎవరి వైపు ఉంటారన్నదే గెలుపోటములను నిర్ణయించే అవకాశం ఉంది.
అనంతపురం అర్బన్‌లో అభివృద్ధి సంగతేంటంటే మాత్రం.. ఎవరి గోలవారిదే అన్నట్టుంది. ఎంపీగా ఉన్నప్పుడే ఎంతో అభివృద్ధి చేశానంటున్న వెంకట్రామిరెడ్డి… ఎమ్మెల్యే అయ్యాక జగన్ అండతో వందలకోట్ల నిధులు తీసుకొచ్చానంటున్నారు.
తాను మున్సిపల్ చైర్మన్‌గా గతంలో చేసిన అభివృద్ధి తప్ప… మరేమీ అనంతపురంలో కనిపించడం లేదన్నది టీడీపీ నేత ప్రభాకర్‌చౌదరి ఆరోపణ. రోడ్లతో పాటు ప్రజలకు అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలు ఎన్నెన్నో కల్పించామంటున్నారు.
జిల్లా కేంద్రంగా ఉన్న అనంతపురంలో… 380 కోట్లతో చేపట్టిన అభివృద్ధిపనులు వైసీపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. కానీ కొన్ని కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రజల అసంతృప్తికి కారణమవుతున్నాయ్.
దశాబ్దాలుగా దినదినాభివృద్ధి చెందుతోంది అనంతపురం. అయితే, దీనిపైనే అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ్. ఇదిగో ఈ రోడ్డు వేసింది మేమే అని ప్రతిపక్షం అంటుంటే… అదిగో మధ్యలో వదిలేసిన ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేసింది మేమే అంటోంది అధికారపక్షం.
అనంతపురంలో రాజకీయాలను పెద్దగా పట్టించుకోని విద్యావంతులే ఎక్కువ. అందుకే, ఇక్కడ ప్రతీసారి పోలింగ్.. 50 నుంచి 60 శాతంలోపే ఉంటుంది. ప్రస్తుతానికైతే పొలిటికల్ అగ్గి రాజుకున్నట్టే కనిపిస్తున్నా.. ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా మారుతాయన్నదే ఆసక్తి రేపుతోంది. అధికార పార్టీ బలంగానే ఉన్నా.. అనంతమైన అసంతృప్తిని సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలా అధిగమిస్తారో.. ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా ప్రతిపక్షం ఎలా మలచుకుంటుందో చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం