Andhra Pradesh: అధికార పార్టీలో పీక్ స్టేజ్‌కు చేరుకున్న వర్గపోరు.. పోటాపోటీ ర్యాలీలతో హైటెన్షన్

|

Aug 28, 2022 | 8:38 AM

సొంతపార్టీలో వర్గపోరును కంట్రోల్ చేయాలంటే ఏ పార్టీకైనా కష్టమైనా పనే. ఓ వర్గానికి మద్దతు ఇస్తే.. మరో వర్గం అలకబూనితే పార్టీకి నష్టం కలుగుతుందనే ఉద్దేశంతో ఒక్కోసారి హైకమాండ్ కూడా మౌనం వహిస్తుంది. అదే పోరు..

Andhra Pradesh: అధికార పార్టీలో పీక్ స్టేజ్‌కు చేరుకున్న వర్గపోరు.. పోటాపోటీ ర్యాలీలతో హైటెన్షన్
Dokka Manikya Varaprasad, S
Follow us on

Andhra Pradesh: సొంతపార్టీలో వర్గపోరును కంట్రోల్ చేయాలంటే ఏ పార్టీకైనా కష్టమైనా పనే. ఓ వర్గానికి మద్దతు ఇస్తే.. మరో వర్గం అలకబూనితే పార్టీకి నష్టం కలుగుతుందనే ఉద్దేశంతో ఒక్కోసారి హైకమాండ్ కూడా మౌనం వహిస్తుంది. అదే పోరు తీవ్ర స్థాయికి చేరితే హైకమాండ్ ఎంటర్ అవ్వాల్సి వస్తోంది. ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని అధికారపార్టీలో ఇద్దరు నేతల మధ్య నెలకొన్న వర్గపోరు హైకమాండ్ కు తలనొప్పిగా మరిందంటున్నారు ఆజిల్లా నేతలు.. ఇంతకీ ఆ ఇద్దరు నేతల్లో హైకమాండ్ మద్దతు ఎవరికుంది.. ఈవర్గపోరు నేపథ్యంలో అధిష్టానం వ్యూహామేంటి..

గుంటూరు జిల్లా తాడికొండ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సొంత నేతల మధ్య తగాదా రోజురోజుకీ హీటెక్కిపోతోంది. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ వర్గాలు సై అంటే సై అంటున్నాయి. తాడికొండ నీదా నాదా… అనే రేంజ్‌లో ఇరు వర్గాలు రోడ్డెక్కాయి. ఎమ్యెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ వర్గీయులు పోటాపోటీ నిరసనలతో స్థానికంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడికొండ నియోజకవర్గంలో డొక్కా మాణిక్యవరప్రసాద్ ను అడినషనల్ కోఆర్డినేటర్‌గా నియమించడంపై ఉండవల్లి శ్రీదేవి వర్గం భగ్గుమంటోంది. మాణిక్యవరప్రసాద్ కు వ్యతిరేకంగా ఉండవల్లి శ్రీదేవి గ్రూప్ తాడికొండలో భారీ ర్యాలీ నిర్వహించింది. శ్రీదేవి వర్గీయులు ర్యాలీ ప్రారంభించే సమయంలో ఒక్కసారిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ వర్గం ఎంట్రీ ఇచ్చింది. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ కు మద్దతుగా.. ఉండవల్లి శ్రీదేవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోటాపోటీ నినాదాలతో తాడికొండలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

డొక్కా మాణిక్యవరప్రసాద్ కారణంగా తాడికొండలో వైసీపీ నష్టపోయే ప్రమాదం ఏర్పడుతోందంటున్నారు శ్రీదేవి అనుచరులు. తమకు సజ్జల రామకృష్ణారెడ్డి సపోర్ట్‌ ఉందని చెప్పుకుంటున్నారు. మరోవైపు ఉండవల్లి శ్రీదేవి వల్ల తాడికొండలో అరాచకం జరుగుతోందంటున్నారు డొక్కా మాణిక్యవరప్రసాద్ అనుచరులు. మూడున్నరేళ్లుగా నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని, డొక్కా నాయకత్వంలో డెవలప్‌మెంట్‌ జరుగుతోందంటున్నారు. రెండు వర్గాలుగా విడిపోయిన అధికార పార్టీ కార్యకర్తలు, చివరికి కొట్టుకునేవరకు వెళ్తున్నారు. ఇరువర్గాలు కూడా తగ్గేదేలే అంటున్నారు. శ్రీదేవి వర్గం రోడ్లపైకి వస్తే, డొక్కా వర్గం కూడా రోడ్లపైకి వస్తోంది. వాళ్లు ప్రెస్‌మీట్‌ పెడితే, వీళ్లూ పెడుతున్నారు. ఇలా తాడికొండ నియోజకవర్గం మొత్తం డొక్కా మాణిక్యవరప్రసాద్, శ్రీదేవి వర్గాల ఆందోళనలతో అట్టుడికిపోతోంది. ఈవర్గపోరు అధిష్టానానికి పెద్ద సమస్యగా మారిందంటున్నారు జిల్లా నేతలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..