ఆంధ్రప్రదేశ్‌కు వాయుగుండం ముప్పు తప్పింది.. ఈ మేరకు వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. ముందుగా ఏపీ వైపు వస్తుందని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వెయ్యగా.. అది దిశను మార్చుకొని వెళుతోందని తాజాగా ప్రకటించింది.. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడినట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.. దీనికి భూభాగం నుంచి వీస్తున్న పొడిగాలులే కారణమని పేర్కొన్నారు.. దీంతో రాష్ట్రానికి వాయుగుండం ముప్పు తప్పినట్లయిందని ప్రకటించారు. ప్రస్తుతం తీవ్ర అల్పపీడనం.. ఈశాన్య దిశగా కదులుతూ తీరానికి దూరంగా వెళ్తూ మరింత బలహీన పడనున్నట్లు తెలిపారు.
దీని ప్రభావంతో సోమవారం వరకు తీరం వెంబడి గంటకు గరిష్ఠంగా 55 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. సముద్రం అలజడిగా ఉన్న నేపథ్యంలో ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
కాగా.. అల్పపీడనం ప్రభావంతో రానున్న రెండు మూడు రోజుల పాటు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంతేకాకుండా.. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాతావరణ పరిస్థితుల వల్ల డిసెంబర్ 24, 25, 26 తేదీల్లో రాయలసీమ, కోస్తాంధ్రలో కొన్నిచోట్ల భారీ వర్షాలు, తేలికపాటి నుంచి మోస్తరు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
కాగా.. వాయుగుండం ప్రభావంతో మూడు రోజుల నుంచి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతోపాటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీల మేర తగ్గాయి. దీంతో పలు ప్రాంతాల్లో చలి తీవ్రత భారీగా పెరిగింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..