తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వాన కురుస్తోంది. నడినెత్తిమీదెక్కి నాట్యమాడేస్తున్నాడు మండే సూరీడు. విపరీతమైన ఉక్కపోత, చెమటతో ఎండ వేడిమి తట్టుకోలేక విలవిల్లాడిపోతోంది జనసామాన్యం. అటు ఇంట్లోనూ ఉండలేం.. ఇటు బైటికీ రాలేం. కూలీనాలీ చేసుకోకపోతే బతుకుతెరువు లేని బడుగుజనం పరిస్థితైతే ఇంకా దుర్భరం.
ఉదయం ఏడెనిమిది గంటలకే చెంప చెళ్లుమనిపిస్తూ… తొమ్మిది గంటలకల్లా చుక్కలు చూపిస్తూ.. పది గంటలకు నడినెత్తిన మంట పెట్టినట్టు సెగలు రేపుతున్నాడు భానుడు. మిట్టమధ్యాహ్నమైతే కుంపటి మంటలే. వారంపదిరోజులుగా ఏపీ, తెలంగాణలో ఎక్కడచూసినా ఇదే పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో ఉదయం 11గంటలకే రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయంటే భానుడి విశ్వరూపం ఏ రేంజ్‌లో ఉందో అర్థంచేసుకోవచ్చు.
అనేక ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటుతోంది గరిష్ట ఉష్ణోగ్రత. టెంపరేచర్స్ పెరుగుడే తప్ప తగ్గడం ఉండదని, రాబోయే నాలుగు రోజుల్లో ఎండలు మరింత మండిపోతాయని, అత్యవసరమైతే తప్ప ఇల్లుదాటి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేస్తోంది భారత వాతావరణ శాఖ. ఏప్రిల్ సెకండ్ వీక్ తర్వాత నిప్పుల కుంపటేనట. రాత్రుళ్లు సైతం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయట.
తెలంగాణలో ఎండలకు సంబంధించి 13 జిల్లాలకు రెండురోజుల పాటు ఆరంజ్ అలర్ట్ జారీ ఐంది. 26 జిల్లాల్లో సగటున 43 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతలతోపాటు తీవ్ర వడగాలులు వీస్తాయని హెచ్చరించింది ఐఎమ్‌డీ. ఏపీలో శనివారం ఏకంగా 388 మండలాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. 179 మండలాల్లో తీవ్రమైన వడగాలులు, 209 మండలాల్లో వడగాలులు వీస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం పరిధిలో గ్రామీణ ప్రాంతాలు ఎండవేడిమికి తల్లడిల్లిపోతున్నాయి. ఇప్పుడే ఏమైంది.. ముందుంది సిసలైన ఎండాకాలం అంటోంది ఐఎండీ. మరి.. మరి.. వడదెబ్బ బారిన పడకుండా ఏం చేయాలి.. ముఖ్యంగా పసిపిల్లలు, వృద్ధుల విషయంలో ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి..? డీహైడ్రేషన్ జరక్కుండా శరీరాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి..? ఈ అప్రమత్తత చాలా కీలకం.
ఎండ తీవ్రత కారణంగా గర్భిణీలు డీహైడ్రేషన్‌కు గురైతే.. ఇక్కట్లు తప్పవు. నెలలు నిండక ముందే ప్రసవం జరగడం, తక్కువ బరువుతో బిడ్డ పుట్టడం, గుండెపోటు, కిడ్నీలో రాళ్లు ఇలా తీవ్ర పరిణామాలు ఎదురౌతాయి. అందుకే… తెలంగాణలో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రభుత్వాస్పత్రుల్లో బెడ్లు, సెలైన్లు, కావల్సిన మందులు అందుబాటులో ఉంచింది.
అటు… రాబోయే వారం రోజుల్లో తెలంగాణలో భిన్నమైన వాతావరణం కనిపించబోతోంది. ఉత్తర తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వానలు పడతాయని, అదే సమయంలో దక్షిణ తెలంగాణలో ఎండలు దంచికొట్టబోతున్నాయని ఐఎమ్‌డి తేల్చింది. దేశవ్యాప్తంగా భానుడి భగభగలు ఇలా కొనసాగుతుంటే.. చిరుజల్లు లాంటి చల్లటి వార్త మోసుకొచ్చారు వెదర్ ఎక్స్‌పర్ట్స్. ఈ ఏడాది ముంచుకొచ్చే ఘోర విపత్తుల్లో ఎల్‌నినో ఒకటిగా నిలువనుందని, ఎల్‌నినో ప్రభావంతో మార్చి నుంచి మే వరకు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఇటీవలే ప్రపంచ వాతావరణ సంస్థ అంచనా వేసింది. కానీ.. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం తక్కువే ఉంటుందని, ఇండియాలో వాతావరణం రుతుపవనాలకు అనుకూలమేనని తాజాగా సంకేతాలొచ్చాయి. సో.. ఆవిధంగా వాతావరణం కాస్త చల్లబడి వేడిగాలుల తీవ్రత తగ్గితేనే ఉపశమనం. లేదంటే.. జూన్ నెల దాకా ఇదే నరకం.