Heavy Rain Alert: వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.. పిడుగులు పడేచాన్స్! వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో శనివారం (జూన్‌ 14) రాష్ట్రవ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణంతో పాటుగా కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది..

Heavy Rain Alert: వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.. పిడుగులు పడేచాన్స్! వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ
Heavy Rain Alert

Updated on: Jun 14, 2025 | 8:05 AM

అమరావతి, జూన్‌ 14: ఉపరితల ఆవర్తనం కర్ణాటక దానిని ఆనుకుని ఉన్న తెలంగాణ, రాయలసీమ మీదుగా సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. పశ్చిమ మధ్య అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి పైన పేర్కొన్న ఉపరితల ఆవర్తనం మీదుగా దక్షిణ ఒడిస్సా తీరం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కి మీ ఎత్తులో ద్రోణి ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీలో నేడు, రేపు వర్షాలు కురవనున్నాయి. ద్రోణి ప్రభావంతో ఏపీలో పలు ప్రాంతాలకు IMD వర్షా సూచన చేసింది. ద్రోణి ఇప్పుడు పశ్చిమ-మధ్య అరేబియా సముద్రం నుండి దక్షిణ ఒడిశా తీరం వరకు కొనసాగుతుంది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో శనివారం (జూన్‌ 14) రాష్ట్రవ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణంతో పాటుగా కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

రేపు ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. నిన్న శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయానికి కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో 50 మిమీ, అల్లూరి జిల్లా అడ్డతీగల 48. 5 మిమీ, అన్నమయ్య జిల్లా గుండ్లపల్లిలో 44.5 మిమీ, విజయనగరం జిల్లా గుల్లసీతారామపురం 40.5 మిమీ, నంద్యాల జిల్లా చౌతకూరులో 32.7 మిమీ చొప్పున వర్షపాతం రికార్తైంది.

తెలంగాణలో మూడు రోజులు వానలే.. వానలు!

మరోవైపు తెలంగాణలోనూ ఈరోజు, రేపు, ఎల్లుండి (జూన్‌ 14, 15, 16 తేదీల్లో) తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ రోజు తెలంగాణ లోని నిర్మల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఉష్ణోగ్రతల విషయానికి వస్తే.. ఈ రోజు తెలంగాణలోని ఖమ్మంలో గరిష్టంగా 36.4, మహబూబ్ నగర్ లో కనిష్టంగా 29.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.