చిన్న చిన్న గొడవలు, మనస్పర్థలతోనే కొంతమంది దారుణాలకు పాల్పడుతున్నారు. వెనుకా ముందు ఆలోచించకుండా సొంతవారినే చంపుకుంటున్నారు. తాజాగా.. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని దేవనకొండ మండలం పి.కోటకొండలో పట్టపగలే ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పి.కోటకొండ గ్రామంలో జాతర సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ.. ప్లాన్ వేసిన మామ.. అల్లుడిని దారుణంగా నరికి చంపాడు.
జాతరలో పాల్గొన్న అల్లుడు సూర్యప్రకాశ్ (23) ను అందరూ చూస్తుండగానే మామ లింగమయ్య కత్తితో దాడి చేసి హత్య చేశాడు. గత కొంతకాలంగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని.. దీంతో లింగమయ్య.. సూర్యప్రకాశ్ పై పగ పెంచుకున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు.
ఈ క్రమంలోనే జాతరలో పాల్గొన్న అల్లుడిని హత్య చేయాలని లింగమయ్య ప్లాన్ రచించాడని.. పథకం ప్రకారం కత్తులు సిద్ధం చేసుకుని సూర్యప్రకాశ్ పై దాడి చేశాడని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలోనే కుప్పకూలిన సూర్యప్రకాశ్ మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.
అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న కారణంతో అల్లుడిని మామ చంపినట్లు పేర్కొంటున్నారు. కాగా.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..