AP News: అబ్బా ఏం మర్యాద.! గోదారోళ్లకి అల్లుడవ్వాలంటే పెట్టి పుట్టాలి.. చూస్తే నోరూరాల్సిందే

వింటే భారతం వినాలి.. తింటే గారలే తినాలి.. అనే కొటేషన్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ఉభయగోదావరి జిల్లాలో ఇప్పుడు సరికొత్త కొటేషన్ తెరపైకి వచ్చింది. పెళ్లి చేసుకుంటే గోదావరి జిల్లాలో అమ్మాయినే చేసుకోవాలి అనే విధంగా కొత్త ట్రెండ్‌కు నాంది పలుకుతున్నారు జిల్లాలోని అత్తమామలు. ఎందుకంటే కొత్త అల్లుడికి గోదావరి జిల్లాలో ఇచ్చే మర్యాద మరి ఎక్కడా ఉండదనే విధంగా ఉంటుందని వారు నిరూపిస్తున్నారు.

AP News: అబ్బా ఏం మర్యాద.! గోదారోళ్లకి అల్లుడవ్వాలంటే పెట్టి పుట్టాలి.. చూస్తే నోరూరాల్సిందే
Ap News

Edited By:

Updated on: Jan 17, 2025 | 1:09 PM

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సంబరాలలో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇరుగు రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి సైతం అతిథులు ఉభయగోదావరి జిల్లాలకు వచ్చారు. సంక్రాంతి అంటేనే ఆనందాల పండుగ అనేటట్టుగా ప్రజలు పండగను ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహించారు. కొత్త అల్లుళ్లు, రకరకాల పిండి వంటలు, ఇంటి ముందు ప్రత్యేకమైన రంగవల్లులతో ప్రతి ఇంటిలో సందడి వాతావరణం కనిపించింది. అయితే ఈసారి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో తొలిసారి సంక్రాంతి పండుగకు వచ్చిన కొత్త అల్లుళ్లకు సరికొత్త రకంగా వెరైటీలతో విందు భోజనం ఏర్పాటు చేశారు వారి అత్తమామలు. చేసుకుంటే గోదావరి జిల్లాలో అమ్మాయినే చేసుకోవాలనే విధంగా ఇప్పుడు కొత్త ట్రెండు సెట్ అవుతోంది. కొత్త అల్లుళ్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న విందు భోజనాలు ఇప్పుడు జిల్లాలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తూ ప్రతి ఒక్కరిని ఆ విధంగా ఆలోచించేలా చేస్తోంది. ఎక్కడెక్కడ ఏ అల్లుళ్లకు ఎలాంటి విందు భోజనాలు ఏర్పాటు చేశారని విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు వందనపు వెంకటేశ్వరరావు, ఆయన భార్య సాయిబాలపద్మ తమ అల్లుడు శివ, కుమార్తె ప్రియాంకను సంక్రాంతి పండుగ సందర్భంగా తమ ఇంటికి ఆహ్వానించారు. వారి వివాహం జరిగిన తర్వాత మొదటి సంక్రాంతి పండుగ కావడంతో వారికి జీవితాంతం గుర్తుండిపోయేలా భారీ బహుబలి విందుని అల్లుడు, కుమార్తె కోసం సిద్ధం చేశారు. కొన్ని రకాల పిండి వంటలు స్వయంగా వారే తయారు చేశారు. జిలేబి, జాంగ్రీ, మైసూర్ పాక్, కలాకందా, పాలకోవా, సేమియా పాయసం ఇలా రకరకాల నోరూరించే స్వీట్లతో పాటు, హాట్ వంటకాలను సైతం తయారు చేశారు. రకరకాల బిర్యానీలు, వివిధ రకాల పళ్లు ఇలా మొత్తం కలిపి 452 రకాలతో విందు భోజనానికి సిద్ధం చేశారు. బంధువులతో పాటు చుట్టుపక్కల మహిళలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఒక్కొక్క వెరైటీని ఒక్కొక్కరు.. అల్లుడు విందు భోజనానికి సిద్ధం చేసిన టేబుల్‌పై ఉంచి అనంతరం తమ అల్లుడు కుమార్తెను అక్కడ కూర్చోబెట్టి ప్రేమతో వాటన్నింటినీ వారికి తినిపించారు. అనంతరం వచ్చిన బంధువుల సైతం 452 రకాల వెరైటీలతో విందును ఆరగించారు. ఇక అదే విధంగా పశ్చిమగోదావరి జిల్లా గణపవరం మండలం మొయ్యేరుకు చెందిన బలుసు శ్రీనువాసు, వెంకట సత్యవతి దంపతులు తమ అల్లుడు కుమార్తె కోసం 227 రకాల వివిధ వెరైటీ రకాలతో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.

శ్రీనువాసు మొదటి కుమార్తెకు గత సంవత్సరం ఫిబ్రవరి 24న తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన శివకుమార్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. మొదటి సంక్రాంతి పండుగ కావడంతో శ్రీనువాసు తన అల్లుడు, కుమార్తెకు వివిధ రకాలైన పిండి వంటలతో తయారుచేసిన స్వీట్లు, రకరకాల వెరైటీలతో భోజన పదార్థాలను మొత్తం కలిపి 227 రకాల వంటలతో విందు ఏర్పాటు చేశారు. అనంతరం ఆ విందు.. వారు ఆనందంగా స్వీకరించారు. ఇక అదే విధంగా ఏలూరు జిల్లా ఉంగుటూరుకు చెందిన ఓ వ్యక్తి తన అక్కాబావ కోసం 116 రకాలతో ప్రత్యేక విందు ఏర్పాటు చేశాడు. ఉంగుటూరుకు చెందిన షేక్ జమాల్ తన సోదరి అజీజ్‌కు మచిలీపట్నానికి చెందిన షేక్ సయీమ్‌తో గత సంవత్సరం సెప్టెంబర్ 22న వివాహం జరిగింది. మొదటి సంక్రాంతి పండుగకు తమ ఇంటికి వచ్చిన బావ సయీమ్‌కు గుర్తిండిపోయేలా విందు ఏర్పాటు చేశారు. మొత్తం 116 రకాల వెరైటీలతో తన సోదరి, బావ కోసం విందు భోజనం సిద్ధం చేశాడు. దానిని వారు ఎంతో ప్రేమగా స్వీకరించారు. గోదావరి జిల్లాలలో అల్లుడుకి ఇచ్చే మర్యాదలు ఎలా ఉంటాయో వారికి చూపించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి