
చలికి మనుషులే కాదు మూగజీవాల సైతం గజగజ వణికిపోతున్నాయి. చలికి తట్టుకోలేక పౌల్ట్రీల్లో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీంతో పౌల్ట్రీ రైతులు.. నష్ట నివారణ కోసం కుంపట్లు పెట్టి వెచ్చదనాన్ని కల్పిస్తున్నారు. కోళ్లకు వేడి నీరు అందిస్తున్నారు. షెడ్ల చుట్టూ పరదాలు కట్టి కోళ్లకు చలి తీవ్రత పెరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
శీతాకాలం పౌల్ట్రీ పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. క్రమంగా తగ్గిపోతున్న ఉష్ణోగ్రతలు.. కోళ్లను చంపేస్తున్నాయి. అనకాపల్లి జిల్లాలో వారం వ్యవధిలో.. భారీగా కోడి పిల్లలు కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. చలి గాలులు వీస్తుండడం, మంచు కురవడం, సాయంత్రం, రాత్రి వేళలో కోళ్ల షెడ్లలో తేమ అధికమై శ్వాస సంబంధ వ్యాధులు కోళ్లకు ప్రబలి కళ్ళు తేలేస్తున్నాయి. చలికి వ్యాధుల బారిన పడి కోళ్లలో అధిక మరణాలు సంభవిస్తాయి.
అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో చలి తీవ్రతకు కోళ్ల మృత్యువాత పడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పౌల్ట్రీ రైతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కోళ్లకు చలి నుంచి నిలువరించేందుకు రైతులు షెడ్ల చుట్టూ పరదాల కడుతున్నారు. తాగడానికి వేడి నీళ్లతో పాటు, బొగ్గు కుంపట్లతో వెచ్చదనాన్ని అందిస్తున్నారు. వేడిని ఇచ్చే విద్యుత్ బల్బులను వినియోగిస్తున్నామని అన్నారు పౌల్ట్రీ లో పనిచేస్తున్న రాజు, అమ్మాజీ.
కోళ్లు చలికి రోగాల బారిన పడి మృత్యువాత పడుతుండడంతో వెటర్నరీ వైద్యులు.. ప్రత్యేక జాగ్రత్తలు సూచిస్తున్నారు. పౌల్ట్రీలకు వెళ్లి మందులు తగిన మోతాదులు అందిస్తున్నారు. కోళ్లకు మందులు ఇవ్వడంతో పాటు.. శీతాకాలం రాత్రి వేళలో ఎక్కువ సమయం, పగలు తక్కువ సమయం ఉండడం వలన సరియైన ఉష్ణోగ్రతను కల్పించడంలో, వెలుతురు ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు వెటర్నరీ వైద్యుడు డాక్టర్ శ్రీనివాస్.
కోడి గుడ్డుకు, మాంసానికి ధర పెరిగిన సమయంలో వాతావరణం ప్రతికూలంగా మారడం రైతుల్లో ఆందోళన మరింత పెంచింది. అమ్మకానికి సిద్ధం చేస్తున్న సమయంలో కోళ్లు, పౌల్ట్రీలో పెరిగే దశలో ఉన్న పిల్లలు మృత్యువాత పడుతుండడం.. నష్టాల్లోకి వెళ్తున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పౌల్ట్రీ రైతులు శేషారత్నం, దేవి. అయితే మరికొన్ని రోజులపాటు ఈ చలి ప్రభావం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో.. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే కోళ్ల మరణాల సంఖ్య తగ్గుతుందని వెటర్నరీ వైద్యులు సూచిస్తున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..