Home guard arrest: అతనో హోంగార్డ్.. వృత్తి సెక్యూరిటీ. ప్రవృత్తి మాత్రం భక్తిభావంతో వచ్చే మహిళల్ని ట్రాప్ చేయడం. ఎన్నాళ్ల నుంచి అలా చేస్తున్నాడో తెలియదు.. ఓ బాధితురాలు డేర్‌గా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హోంగార్డ్ కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. ఇంతకా ఎవరా కీచకుడు.. తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే.. విశాఖపట్నం నగరానికి చెందిన ఇతను హోంగార్డ్ వీర సర్వేశ్వరరావు. రుషికొండ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే వెంకటేశ్వర స్వామి ఆలయంలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. గత నెల 28న మిథులాపురి ఉడా కాలనీలో ఉండే నేవి డాక్టర్ భార్య దైవ దర్శనం కోసం వెళ్లింది. ఆ సమయంలో అక్కడే ఉన్న సర్వేశ్వరరావు ఆమెతో మాటలు కలిపాడు. చాలా తొందరగా శ్రీవారి దర్శనం చేయించాడు. ఆలయానికి ఎప్పుడొచ్చినా తనను కాంటాక్ట్ కావాలని ఫోన్ నంబర్ కూడా ఇచ్చాడు. మొదట్లో భక్తి భావంతో కూడిన మెసేజ్‌లు పెట్టేవాడు. ఆ తర్వాత అసభ్యకర సందేశాలు పంపించాడు. అంతటితో ఆగకుండా పోర్న్ వీడియోలు పంపి మానసికంగా టార్చర్ పెట్టాడు. సర్వేశ్వరరావు తీరుతో చాలాసార్లు మొబైల్ ఫోన్ స్విచాఫ్ చేసేది.
మొదట్లో లైట్ తీసుకున్న బాధితురాలు.. ఆ తర్వాత ధైర్యం చేసి పీఎం పాలెం పోలీసుల్ని ఆశ్రయించింది. హోంగార్డ్ నిర్వాకాన్ని మొత్తాన్ని వివరించింది. కేసు ఫైల్ చేసిన పోలీసులు 509 ఐపీసి, ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. అనంతరం సర్వేశ్వరరావును అరెస్ట్ చేసి రిమాండ్‌కి పంపారు. హోంగార్డ్ గతంలో ఇలాంటి ఘటనలకు పాల్పడ్డాడా? అతని బారిన పడ్డ మహిళలు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో పోలీసులు ఆరాతీస్తున్నారు.
వేధింపుల బారిన పడే బాధితులు లేనిపోని భయాలను ఊహించుకుని మౌనంగా ఉంటే.. సర్వేశ్వరరావు లాంటి వాళ్లకు అవకాశం ఇచ్చినట్టేనంటున్నారు పోలీసులు. ధైర్యంగా తమకు సమాచారం ఇవ్వాలని సజెస్ట్ చేస్తున్నారు. భక్తి భావంతో ఆలయానికి వెళ్తే అక్కడ కూడా కామపిశాచాలు ఉండటం దురదృష్టకరమంటున్నారు స్థానిక మహిళలు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.