AP Rains: అనంతపురం జిల్లాను ముంచెత్తుతున్న వర్షాలు.. వరద ప్రవాహంలో కొట్టుకోపోయిన లారీ ట్యాంకర్..

|

Oct 13, 2022 | 11:13 AM

అనంతపురం వైపు నుంచి వస్తున్న వరదతో మరువ కాలువకు ఉధృతి పెరగడంతో.. మరువ కాల్వ దాటుతుండగా లారీ నీటిలో కొట్టుకుపోయింది. అనంతపురం నగరం మొత్తం భారీ వరద ప్రవాహన్ని..

AP Rains: అనంతపురం జిల్లాను ముంచెత్తుతున్న వర్షాలు.. వరద ప్రవాహంలో కొట్టుకోపోయిన లారీ ట్యాంకర్..
Heavy Rains Anantapur
Follow us on

అనంతపురం జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో చెరువులకు వరద ప్రవాహం భారీగా పెరిగింది. అనంతపురం నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. ఏకధాటిగా పడుతున్న వానలకు లోతట్టు ప్రాంతాలు, కాలనీలు జలమయమయ్యాయి. కొన్ని కాలనీలు వరద నీటితో నిండిపోయాయి. జిల్లాలోని బుక్కరాయ సముద్రం చెరువు వద్ద వంక ప్రవాహంలో లారీ ట్యాంకర్ కొట్టుకుపోయింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువుకు భారీగా వరద ప్రవాహం పెరిగింది. దీంతో అనంతపురం వైపు నుంచి వస్తున్న వరదతో మరువ కాలువకు ఉధృతి పెరగడంతో.. మరువ కాల్వ దాటుతుండగా లారీ నీటిలో కొట్టుకుపోయింది. అనంతపురం నగరం మొత్తం భారీ వరద ప్రవాహన్ని తలపిస్తోంది. దీంతో పలు చోట్ల రాకపోకలను పోలీసులు పూర్తిస్థాయిలో నిలిపివేశారు. అనంతపురం సహా పలు ప్రాంతాల్లో వరద ముంపు కొనసాగుతూనే ఉంది. కాలనీలకు కాలనీలు నీళ్లలో నానుతున్నాయి. అనంతపురం నగరంలో దాదాపు 18 కాలనీలు ముంపులో ఉన్నట్టు తెలుస్తోంది.

అనంతపురం వరదలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష

అనంతపురంలో వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. వరద బాధితులకు అండగా నిలవాలని సీఏం ఆదేశించారు. బాధిత కుటుంబాలకు రూ.2 వేల చొప్పున.. తక్షణ సాయం అందించాలని అధికారులను సీఏం ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని అధికారులు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డికి వివరించారు. అనంతపురంలో ఆకస్మికంగా కుండపోత వర్షాలు, వరదలు సంభవించిన ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యల గురించి అధికారులు తెలియజేశారు. వర్షాలు, వరదలు కారణంగా నిర్వాసితులైన వారికి అండగా నిలవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తక్షణ ఆర్థిక సాయంతో పాటు బియ్యం, పామాయిల్‌, కందిపప్పు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలను ప్రతి బాధిత కుటుంబానికి చేరవేయాలని సీఎం ఆదేశించారు. వర్షాలు, వరదలు తగ్గుముఖం పట్టగానే ఆస్తి, పంటనష్టంపై అంచనాలు తయారుచేయాల‌న్నారు. నిర్ణీత సమయంలోగా పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.

రాయలసీమలో విస్తారంగా వర్షాలు

రాయలసీమ ప్రాంతంలోని కొన్ని చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఆదోనిలో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి ఓ ఇంటి పైకప్పు కూలింది. ఈ ఘటనలో ఆ ఇంట్లో ఒకరు చనిపోయారు. మరో ఇద్దరికి గాయలయ్యాయి. ఆదోని ప్రభుత్వ ఆస్పత్రిలో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు కర్నూలు జిల్లా అల్వాల గ్రామంలో కుండపోత వర్షం కురిసింది. రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద నీరు పొలాల్లోకి చేరడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. పొలాలన్నీ నీట మునిగాయి. చేతికొచ్చిన పంట నీటిపాలవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. పెట్టుబడి కూడా రాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నిర్మల్ లో దంచికొట్టిన వాన

తెలంగాణలోని నిర్మల్‌ జిల్లాలోనూ వాన దంచికొట్టింది. పంట మొత్తం వర్షార్పణమైంది. కుండపోత వానతో సోయా, పత్తి రైతులు బోరుమని విలపిస్తున్నారు. బైంసా డివిజన్‌లో సోయా, పత్తి పంట భారీగా దెబ్బతింది. తేమ శాతం పెరిగి నాణ్యత డొల్లగా మారింది. దిగుబడి రాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాంత రైతులు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

అనంతపురంలో కురిసిన భారీ వర్షాలకు రహదారిపై నిలిచిన నీరు, వరద ప్రవాహనికి కొట్టుకుపోయిన లారీ

మరికొన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వార్తల కోసం చూడండి..