Weather: తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. రాగల రెండు రోజుల్లో భారీ వర్షాలు.. ఎక్కడెక్కడంటే?

|

Aug 26, 2022 | 7:58 AM

India Meteorological Department: గడిచిన 24 గంటల్లోనూ పలు జిల్లాలో భారీ వర్షం కురిసినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Weather: తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. రాగల రెండు రోజుల్లో భారీ వర్షాలు.. ఎక్కడెక్కడంటే?
Telangana Rain Alert
Follow us on

Telangana – Andhra Pradesh: రానున్న రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో శనివారం, ఆదివారాల్లో.. ఆంధ్రప్రదేశ్‌లో శుక్ర, శని వారాల్లో చాలాచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావారణ శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లోనూ పలు జిల్లాలో భారీ వర్షం కురిసినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్..

రాయలసీమలో నేడు, రేపు పలు చోట్ల భారీవర్షాలు, ఇతర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గడిచిన 48 గంటలుగా అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, అనంతపురం, పొట్టి శ్రీరాములు నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కాగా, ప్రకాశం జిల్లాలోని చీమకుర్తిలో 101, చెన్నిపాడులో 112.5 మి.మీ, బాపట్ల జిల్లా నూజెళ్లపల్లిలో 90 మి.మీ, నెల్లూరు జిల్లా పెద్దచెరుకూరులో 92 మి.మీ చొప్పున భారీ వర్షం కురిసింది. అయితే, కొన్నిచోట్ల మాత్రం ఎండలు మండిపోతున్నాయి. గురువారం నాడు ఒంగోలులో 37.7 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ప్రకాశం జిల్లా తాళ్లూరు, నంద్యాల జిల్లా గోనవరం, తిరుపతి జిల్లా కొత్తగుంట ప్రాంతాల్లో 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి

తెలంగాణ..

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం.. దక్షిణ జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుందని, ఇది సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తున విస్తరించినట్లు తెలిపింది. దీంతో పాటు మరో ఆవర్తనం దక్షిణ అంతర్గత తమిళనాడు పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల వరకు విస్తరించిందని పేర్కొంది. అలాగే ఈనెల 29న కూడా సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

దేశ వ్యాప్తంగా వణికిస్తున్న వర్షాలు..

రాజస్థాన్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా పడుతున్న వర్షాలతో కోట, బరన్, ఝలావర్, బుండి జిల్లాలు నీట మునిగాయి. ఇప్పటికే బరన్ జిల్లాలో వరదల్లో ఇద్దరు కొట్టుకుపోయారు. బుండి జిల్లాలో మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఈ జిల్లాల్లో స్కూళ్లకు అధికారులు సెలవులు ప్రకటించారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్​ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. బరన్ జిల్లాలో రెస్క్యూ ఆపరేషన్​ నిర్వహించేందుకు ఇండియన్ ఎయిర్​ ఫోర్స్ హెలికాఫ్టర్ రంగంలోకి దిగింది.కోట జిల్లా కలెక్టర్ ఆధికారులతో సమావేశమై వరద తీవ్రతపై చర్చించారు. చంబల్ నది లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను తరలిస్తున్నారు. కోట జిల్లాలో ఇప్పటివరకు 3500 మందిని తరలించినట్లు పేర్కొన్నారు. 4 లక్షల మందికి సరిపడేలా వాటర్ ట్యాంకులను తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఝలావర్‌‌ జిల్లాలో చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉన్నాయని అధికారులు తెలిపారు.వర్షాలు పడ్డాయంటే చాలా గ్రామాలు వరదలతో హోరెత్తుతాయి.

ఇదే పరిస్థితి మధ్యప్రదేశ్​ రాజధానిలోనూ నెలకొంది. భోపాల్​ బైరాసియా పరిధిలోని మైనాపురాలో ఓ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అందులో ఒక గర్భిణీని కాలువ అవతలివైపుకు తీసుకొని వెళ్లడానికి గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాలువపై తాత్కాలికంగా ఒక వంతెనను నిర్మించి, ఆమెను మంచం మీద మోసుకెళ్తూ దాటించారు. అలాగే మంచంపైనే ఆస్పత్రికి తరలించారు. ఓవైపు భారీ వర్షం, మరోవైపు ప్రమాదకరమైన వంతెన. సరైన రోడ్డు సౌకర్యం లేనందున వారిని ఈ సమస్య వెంటాడుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.