విశాఖపట్నంలో రాష్ట్రపతి యుద్ధనౌకల సమీక్ష సందర్భంగా.. భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ మనీష్ కుమార్ సిన్హా అన్నారు. నగరానికి రాష్ట్రపతి వస్తున్నందున ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు కోసం రెండు వేల మంది పోలీసులను కేటాయించామని తెలిపారు. అవసరాన్ని బట్టి మరింతగా అదనపు బలగాల్ని మోహరిస్తామని వివరించారు. ఈ నెల 21న రాష్ట్రపతి యుద్ధ నౌకల సమీక్ష నిర్వహించనున్నారు. ఆర్.కె.బీచ్‌కు సమీపంలో సాగరంలో ఈ కార్యక్రమం జరుగనుంది. అదంతా సముద్రంలో జరుగుతున్న నేపథ్యంలో రహదారులపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని సీపీ స్పష్టం చేశారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పర్యటించే అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేయించాలని సంబంధిత అధికారులను సీపీ ఆదేశించారు. ‘మిలాన్’ లో భాగంగా ఈ నెల 27న జరిగే ‘అంతర్జాతీయ నగర కవాతు’ కు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మూడు నుంచి ఐదువేల మంది సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. వివిధ దేశాల నుంచి అతిథులు రానున్న నేపథ్యంలో.. ట్రాఫిక్ మళ్లింపులు కూడా ఉంటాయన్నారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.
నౌకా దళ యుద్ధ విన్యాసాలకు విశాఖ తీరం సిద్ధమైంది. అంతర్జాతీయంగా స్నేహపూర్వక వాతావరణం, సమన్వయం, సహకారంతో మహా సముద్రాల మధ్య బంధాల్ని బలోపేతం చేసే ప్రధాన ఘట్టాలకు విశాఖలోని తూర్పు నౌకాదళం ఆతిథ్యమిస్తోంది. ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ (పీఎఫ్‌ఆర్), వివిధ దేశాల నౌకా దళాల యుద్ధ విన్యాసాలతో మిలాన్ – 2022 కు ఏర్పాట్లు చేసింది. ఈ రెండు ప్రతిష్టాత్మక విన్యాసాల కోసం నౌకాదళం చేస్తున్న రిహార్సల్స్‌తో విశాఖ సాగర తీరం సందడిగా కనిపిస్తోంది.
గతంలో విశాఖ కేంద్రంగా ఒక ఫ్లీట్ రివ్యూ, ఒక అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ జరిగాయి. 2006లో తొలిసారి పీఎఫ్‌ఆర్ జరిగింది. అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం భారత నౌకాదళ సామర్థ్యాన్ని సమీక్షించారు. అనంతరం 2016లో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్) జరిగింది. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరయ్యారు. ఇప్పుడు జరుగుతున్నది రెండో పీఎఫ్‌ఆర్. భారత దేశంలో మొదటి ఫ్లీట్ రివ్యూ 1953 అక్టోబరు 19న ముంబైలో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది. ఇప్పటివరకు 11 పీఎఫ్‌ఆర్‌లు జరిగాయి.
Also Read
Heart Attack: మొదటిసారే గుండెపోటు తీవ్రంగా ఎందుకు ఉంటుంది..? మరణానికి దారితీసే కారణాలు ఏమిటి..?
PF డబ్బులు అకౌంట్లోనే స్ట్రక్ అయిపోయాయా..? అయితే ఎలా విత్ డ్రా చేసుకోవాలో తెలుసా..
మద్యం తాగి వేధిస్తున్నాడని.. భర్త జననాంగాలు కోసి చంపిన భార్య