Andhra Pradesh Heatwave: ఎండలు ఠారెత్తిస్తున్నాయి.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. భానుడి ప్రతాపానికి ఇళ్లలోనుంచి బయటకు అడుగుపెట్టేందుకు ప్రజలు జంకుతున్నారు. అయితే, రాష్ట్రంలో వడగాల్పులు తీవ్రత కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి డా.బిఆర్ అంబేద్కర్ గురువారం తెలిపారు. మరికొన్ని రోజులపాటు ఇవే ఉష్ణోగ్రతలు కొనసాగుతాయిన పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ.. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే, శుక్రవారం 268 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 235 మండలాల్లో వడగాల్పులు, శనివారం 235 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 219 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అయితే, సోమవారం తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
గురువారం ఏలూరు జిల్లా పంగిడిగూడెంలో 44.5°C, ప్రకాశం జిల్లా కురిచేడులో 44.2°C, తూర్పుగోదావరి జిల్లా చిట్యాల, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో 44.1°C, తిరుపతి జిల్లా సత్యవేడులో 44°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అలాగే 210 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 220 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు.
ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిన్నారు. ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. రాష్ట్రంలో అక్కడక్కడ ఈదురగాలులతో వర్షాలు కురుస్తాయని.. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..