ఈ భూమి ఎన్నో కోట్ల జీవులకు ఆవాసం. మనుషులతో పాటు పశుపక్షాదులు, కీటకాలు, రకరకాల పురుగులు, బ్యాక్టీరియా ఈ నేలపై ఉంటాయి. అయితే కొన్ని రకాల పురుగులు కొన్ని ప్రత్యేక సీజన్లలో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. అలానే ఇప్పటి జనరేషన్ వాళ్లకు తెలియని ఆరుద్ర పురుగులను ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాం. రైతులు దుక్కులు దున్నాక.. తొలకరి జల్లులు పడగానే.. ఈ పురుగులు పొలాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఆరుద్ర కార్తిలో ఈ పురుగులు తారసపడుతూ ఉంటాయి. గతంలో ఎక్కువగా కనిపించేవి కానీ.. ఇప్పుడు క్రిమి సంహారక మందుల పిచాకారీ., రసాయన ఎరువుల వినియోగం. పెరుగుతున్న కాలుష్యం నేపథ్యంలో వాటి ఉనికి కూడా ప్రశ్నార్థకమైంది. ఎప్పుడూ భూమి లోపల నివాసం ఉండే ఈ పురుగులు.. తొలకరి వానలు పడ్డప్పుడు మాత్రమే బయటకు వచ్చి కనువిందు చేస్తాయి.
ఈ పురుగులు పొలాల్లో కనిపిస్తే.. రైతుల్లో ఆనందం వెల్లువిరిస్తుంది. ఆరుద్ర పురుగులు కనిపించాయంటే ఏడాదంతా దండిగా వర్షాలు పడతాయని.. కాలవలు చెరువులు, కుంటలు నీటితో నిండుతాయని నమ్మకం. అలాగే పంట దిగుబడి కూడా బాగా ఉంటుందని చెబుతుంటారు. ఎర్రగా, బొద్దుగా.. చూడటానికి ఎంతో అందంగా ఉండే ఆరుద్ర పురుగు ఆగమనాన్ని అన్నదాతలు శుభసూచకంగా చెబుతుంటారు. ఇంద్రగోప, చందమామ, లేడీ బర్డ్, కుంకుమ పురుగులు ఇలా రకరకాల పేర్లతో దీన్ని పిలుస్తూ ఉంటారు. మనం తాకాం అనుకోండి.. ఈ పురుగులు కాసేపు అక్కడే ఆగిపోతాయి. అప్పట్లో పిల్లలు ఈ పురుగులతో ఆడుకునేవారు. ఇప్పుడు వాటి గురించి చెప్పేవారు కూడా కరువయ్యారు. ఆరుద్ర కార్తె ముగిసినప్పటికీ ఈ అందమైన పురుగులు అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..