
మద్దతుదారుల పేరిట తనను ప్రశ్నించడం మానుకోవాలని వార్నింగ్ ఇచ్చారు పవన్ కల్యాణ్. తనవారైతే తన వెంటే నడవాలని సూచించారాయన. దీనిపై స్పందించిన హరిరామజోగయ్య తాను ఇచ్చిన సలహాలు పవన్‌కు నచ్చినట్లు లేదంటూ మరో లేఖ రాయడం హాట్ టాపిక్‌గా మారింది. తాడేపల్లిగూడెం బహిరంగ సభ వేదికగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆవేశంగా ప్రసంగించారు. ఎవరి పేరు ప్రస్తావించకుండానే మద్దతుదారుల పేరిట తనను ప్రశ్నిస్తున్న వారిపై కన్నెర్ర చేశారాయన. తనతో పాటు యుద్ధం చేసే ఉరకలెత్తే యువరక్తం కావాలన్నారు పవన్.
పవన్ వ్యాఖ్యల్లో తన పేరు ప్రస్తావించకున్నా కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్య స్పందించారు. టీడీపీ-జనసేన బాగు కోరి తాను ఇచ్చిన సలహాలు చంద్రబాబుకు, పవన్‌కు నచ్చినట్లు లేదంటూ లేఖ రాశారు. తన సలహాలు నచ్చకపోవడం వాళ్ళ ఖర్మ తాను చేసేదేమీ లేదని లేఖలో రాశారాయన. టీడీపీ-జనసేన పొత్తు కుదిరినప్పటినుంచీ హరిరామజోగయ్య అనేక బహిరంగ లేఖలు రాశారు. కాపు సామాజిక వర్గం వారు ఎక్కువగా ఏఏ నియోజకవర్గాల్లో ఉన్నారో తెలియజేయడంతో పాటు జనసేన ఎక్కడెక్కడ పోటీ చేస్తే బాగుంటుందో కూడా లేఖల్లో రాశారు. జనసైనికుల మనోగతాన్ని తన లేఖల ద్వారా వెల్లడిస్తున్నానంటూ ఎన్ని ఎంపీ సీట్లు తీసుకోవాలో, ఎన్ని ఎమ్మెల్యే నియోజకవర్గాలు తీసుకోవాలో కూడా సూచించారు హరిరామజోగయ్య. ఇదిలా ఉంటే హరిరామయ్య జోగయ్య కుమారుడు చేగోండి ప్రకాష్ ఆచంట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ గా ఉన్నారు. ఈయన టీడీపీ జనసేన జెండా సభకు డుమ్మా కొట్టారు. పైగా సభలో పవన్ మాటలకు హరిరామ జోగయ్య లేఖద్వారా బదులు ఇచ్చారు. ఒకవైపు కుమారుడు చేగొండి ప్రకాష్ సభకు గైర్హాజరు, మరో వైపు పవన్ వ్యాఖ్యలు, ఇంకో వైపు హరిరామ జోగయ్య లేఖలు వీటన్నింటినీ ఆసక్తిగా గమనిస్తున్నారు ప్రజలు. జనసైనికులు కూడా ఈ రాజకీయాలపై ఏం జరుగుతుందా అని ఎదురుచూస్తున్నారు.
పొత్తులో భాగంగా జనసేన తరపున పోటీ చేసే అభ్యర్థులకు ఓటు ట్రాన్స్‌ఫర్ అయ్యేలా చూడటంతో పాటు గెలిపించే బాధ్యత కూడా టీడీపీదే అని కూడా లేఖల్లో రాశారు హరిరామజోగయ్య. జనసేన తరపు అభ్యర్థులను గెలిపించకపోతే టీడీపీ నష్టమని తన లేఖల్లో హెచ్చరించారు కూడా. పొత్తులో భాగంగా పవన్ కనీసం రెండున్నరేళ్లు సీఎం కావాలని జనసైనికులు కోరుకుంటున్నారని కూడా జోగయ్య తన లేఖల్లో రాశారు. చంద్రబాబు దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని జనసైనికులు కోరుకుంటున్నారని జోగయ్య లేఖల్లో రాశారు. పొత్తులో భాగంగా కేవలం 24 ఎమ్మెల్యే, 3 ఎంపీ స్థానాలు మాత్రమే తీసుకోవడాన్ని జోగయ్య తన లేఖల్లో విమర్శించారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే పవన్ తాడేపల్లిగూడెం సభలో ఘాటు వ్యాఖ్యలు చేశారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పవన్ తన పేరు ప్రస్తావించకున్నా జోగయ్య స్పందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన సలహాలు నచ్చకపోవడం వాళ్ల ఖర్మ అని రాయడం ద్వారా ఇక లేఖల పరంపరను జోగయ్య ముగింపు పలుకుతారని జనసేన వర్గాలు భావిస్తున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..