AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘నా కుటుంబానికి న్యాయం చేయండి’.. చనిపోయే ముందు యువ రైతు ఆవేదన.. కన్నీళ్లు పెట్టిస్తున్న సెల్ఫీ!

పల్నాడు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అప్పుల బాధ, వడ్డీ వ్యాపారి వేధింపులు, స్నేహితుడి మోసాన్ని తట్టుకోలేక ఓ యువ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసి తన బాధను వెల్లడించడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటన బొల్లాపల్లి మండలం రావులాపురం గ్రామంలో చోటుచేసుకుంది.

‘నా కుటుంబానికి న్యాయం చేయండి’.. చనిపోయే ముందు యువ రైతు ఆవేదన.. కన్నీళ్లు పెట్టిస్తున్న సెల్ఫీ!
Young Farmer Suicide
T Nagaraju
| Edited By: |

Updated on: Jun 13, 2026 | 5:59 PM

Share

పల్నాడు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అప్పుల బాధ, వడ్డీ వ్యాపారి వేధింపులు, స్నేహితుడి మోసాన్ని తట్టుకోలేక ఓ యువ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసి తన బాధను వెల్లడించడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటన బొల్లాపల్లి మండలం రావులాపురం గ్రామంలో చోటుచేసుకుంది.

రావులాపురం గ్రామానికి చెందిన నాగిరెడ్డి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆరేళ్ల క్రితం వివాహం కాగా, భార్యతో కలిసి సాధారణ జీవితం గడుపుతున్నాడు. అయితే వ్యవసాయ అవసరాల కోసం గ్రామానికే చెందిన ప్రకాశరావు వద్ద తన పొలం పత్రాలను తనఖా పెట్టి రూ.10 నుంచి రూ.15 లక్షల వరకు అప్పు తీసుకున్నట్లు తెలుస్తోంది. అప్పు తీసుకున్నప్పటి నుంచి ప్రతి ఏడాది వడ్డీ క్రమం తప్పకుండా చెల్లిస్తున్నప్పటికీ, అసలు అప్పు మాత్రం తగ్గకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు.

మిర్చి సాగు ద్వారా వచ్చిన ఆదాయంలో పెద్ద భాగాన్ని ప్రకాశరావుకు చెల్లించేవాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గత మూడేళ్లలోనే సుమారు రూ.18 లక్షల వరకు చెల్లించినప్పటికీ, ఇంకా అప్పు తీర్చాల్సి ఉందంటూ ప్రకాశరావు ఒత్తిడి తీసుకొచ్చాడని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా పొలం పత్రాలు కూడా తిరిగి ఇవ్వకుండా వేధించాడని నాగిరెడ్డి తన సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు.

ఇదే సమయంలో స్వామి అనే స్నేహితుడికి నాగిరెడ్డి కొంత డబ్బు అప్పుగా ఇచ్చాడు. వాటిపై వడ్డీ చెల్లిస్తున్నప్పటికీ, అసలు డబ్బు తిరిగి ఇవ్వలేదని తెలిపాడు. ఒకవైపు అప్పుల భారం, మరోవైపు స్నేహితుడి మోసం, వడ్డీ వ్యాపారి ఒత్తిళ్లు అతడిని తీవ్ర మానసిక వేదనకు గురి చేశాయి. చివరకు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న నాగిరెడ్డి, చనిపోవడానికి ముందు తీసిన వీడియోలో తన మరణానికి ప్రకాశరావే కారణమని ఆరోపించాడు. అలాగే తనకు ఇవ్వాల్సిన డబ్బును స్వామి తన భార్యకు అందించాలని కోరాడు.

యువ రైతు సెల్ఫీ వీడియో ఇక్కడ చూడండి..

నాగిరెడ్డి మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇప్పటికైనా బాధ్యులపై చర్యలు తీసుకుని, నాగిరెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us