
ఏపీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హంద్రీనీవా కెనాల్ (హెచ్‌ఎన్‌ఎస్) పీలేరు యూనిట్-2 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమ (50) మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అవ్వగా.. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంబేపల్లి మండలం యర్రగుంట్ల వద్ద ఎదురెదురుగా రెండు కార్లు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రిలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ పరామర్శించారు. మృతి చెందిన డిప్యూటీ కలెక్టర్ రమ అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ గ్రీవెన్స్‌కు కోఆర్డినేటర్‌గా పని చేస్తున్నట్లు తెలిసింది. ఆమెది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం అని అధికారులు తెలిపారు. పీలేరు నుంచి రాయచోటిలోని కలెక్టరేట్ గ్రీవెన్స్ కార్యక్రమానికి వెళ్తుండగా ఆమె రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయారు.
సంతాపం తెలిపిన సీఎం…
హంద్రీనీవా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుగాలి రమ మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. రమ మృతి దురదృష్టకరమని.. కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సానుభూతి తెలిపారు. ధైర్యంగా ఉండాలని కోరారు. ప్రమాదంలో గాయపడిన మరో నలుగురికి మెరుగైన వైద్య సేవల అందించాలని అధికారులను ఆదేశించారు.
మంత్రులు నారా లోకేశ్, మండిపల్లి రాంప్రసాద్‌లు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి మృతిపై విచారం వ్యక్తం చేశారు. వారి ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఘటనపై జిల్లా కలెక్టర్ శ్రీధర్‌తో ఫోన్లో మాట్లాడిన మంత్రి మండిపల్లి.. ప్రమాదంపై పూర్తి నివేదిక ఇవ్వాలని కోరారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..